
పెచ్చుమీరిన కాంగ్రెస్ నేతల దౌర్జన్యాలు
ఖమ్మంవైరారోడ్: జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పెచ్చుమీరిపోయాయని.. బీఆర్‌ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మండిపడ్డారు. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు వేధించడంతోనే తమ పార్టీ నాయకుడు బానోత్ రవి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, బానోత్ చంద్రావతి, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్‌తో కలిసి ఖమ్మంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడారు. జిల్లా మంత్రులు అభివృద్ధిపై దృష్టి సారించకుండా బీఆర్‌ఎస్ నాయకులను రాజకీయంగా అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిని ఇబ్బంది పెట్టడం నిత్యకృత్యంగా మారిందని తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకుడు రవిని వేధి స్తున్న వారిపై పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం గర్హనీయమన్నారు. అయి తే, అధికార పార్టీ నాయకులు పోలీసుల ద్వారా తమ శ్రేణులపై అణచివేతకు పాల్పడినా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించడం తథ్యమని ఎంపీ, ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. నాయకులు ఉప్పల వెంకటరమణ, ఖమర్, బెల్లం వేణు పాల్గొన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై చర్యలు తీసుకుని, వేధింపులకు గురిచేస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని కోరారు.
ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ మధు