శాఖల వారీగా వివరాలు
ఎస్సీ సంక్షేమశాఖ..
బీసీ సంక్షేమశాఖ..
గిరిజన సంక్షేమశాఖ..
● నెలల తరబడి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం ● అప్పు చేసి విద్యార్థులకు భోజనం పెడుతున్న అధికారులు ● జిల్లా బకాయిలు రూ.11.94 కోట్లకు పైగానే..
ఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులు చదువుకునేలా ప్రభుత్వం సంక్షేమ వసతిగృహాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ టిఫిన్, భోజనం కల్పనకు నెలనెలా తరగతి ఆధారంగా మెస్ చార్జీలతో పాటు సబ్బులు, నూనె, జుట్టు కత్తిరించుకునేందుకు కాస్మోటిక్ చార్జీల పేరిట చెల్లించాలి. కానీ ఈ బిల్లులు నెలనెలా మంజూరు కాకపోవడంతో విద్యార్థులే కాక సంక్షేమ అధికారులూ ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ వసతిగృహాలకు ఆరు నెలల నుండి ఎనిమిది నెలల బిల్లులు రాకపోవడంతో అప్పుచేసి మరీ సరుకులు తీసుకురావాల్సి వస్తుందని వార్డెన్లు వాపోతున్నారు. మరోపక్క సబ్బులు, నూనె లేక విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇక ఎస్సీ సంక్షేమశాఖలో పోస్టు మెట్రిక్ విద్యార్థులకు రూ.500 చొప్పున పాకెట్ మనీ కూడా అందడం లేదు.
ఖర్చులు ఇలా..
ప్రభుత్వం ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ వసతిగృహాల కు విద్యార్థుల సంఖ్య ఆధారంగా బియ్యం సరఫరా చేస్తుంది. ఇతర సరుకుల కోసం మెస్ బిల్లులు ఇస్తుంది. ఈ డబ్బుతోనే వసతిగృహ సంక్షేమ అధికారులు(వార్డెన్లు) వంట గ్యాస్, గుడ్లు, పాలు కొనగోలు చేయడమే కాక అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనా లు, వారానికి రెండు సార్లు చికెన్ సమకూర్చాలి. అయితే, గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ బాలికల వసతిగృహాలకు వీటి సరఫరా కోసం టెండర్లు నిర్వహిస్తున్నారు. కానీ వసతిగృహాల్లో ఆ పరిస్థితి లేక ప్రభుత్వం ఇచ్చే మెస్ బిల్లులతోనే వార్డెన్లు సరుకులు తెప్పించాల్సి వస్తోంది.
నెలల తరబడి..
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభివృద్ధి శాఖల వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించే విషయంలో శక్తికి మించి శ్రమిస్తున్నామని సంక్షేమాధికారులు చెబుతున్నారు. అయినా డైట్ బిల్లులు నెలల తరబడి మంజూరు కావడం లేదని వాపోతున్నారు. ఫలితంగా అప్పు చేసి సరుకులు కొనుగోలు చేయాల్సి వస్తోందని వెల్లడించారు. శాఖల వారీగా టెండర్లను పిలిచి పాలు, కూరగాయలు, పెరుగు, నిత్యావసరాలు సరఫరా చేయాల్సి ఉన్నా అధిక ధరలు, ఇతర కారణాలతో అమలు కావడం లేదు. ఫలితంగా సంక్షేమాధికారులే బిల్లులు వచ్చినప్పుడు తీసుకోవచ్చని ముందస్తుగా డబ్బు పెట్టి సరుకులు కొనుగోలు చేసి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం సమకూరుస్తున్నారు. కానీ నెలల తరబడి బిల్లులు రాక అప్పుల పాలవుతుండగా.. ఇంకొందరు ఆస్తులు, బంగారం తాకట్టు పెట్టి వడ్డీల భారం మోస్తున్నారు.
బకాయలు రూ.కోట్లలోనే
జిల్లాలో 52 ఎస్సీ, 31 బీసీ, 30 ఎస్టీ వసతిగృహా లు, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం డైట్ చార్జీలను ఇస్తుంంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డైట్ బడ్జెట్ పెంచింది. ప్రభుత్వం నిర్ణయించిన డైట్ చార్జీల ప్రకా రం ప్రతీనెలా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు సుమారు రూ.1.50 కోట్లకు పైగా ఖర్చవుతోంది. కానీ ఈ బిల్లులను కొద్దినెలలుగా మంజూరు చేయకపోవడంతో సుమారు రూ. 11,94, 50,00కు పైగా బకాయి పేరుకుపోయింది.
వారికి ఎనిమిది నెలలు..
ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు డైట్ బిల్లులు రావాల్సి ఉండగా.. గిరిజన సంక్షేమశాఖకు సంబందించి ఈ ఏడాది ఫిబ్రవరి నుండి సెప్టెంబర్ వరకు పెండింగ్ ఉన్నాయి. గిరిజన సంక్షేమశాఖలో ఒక పక్కబిల్లులురాక విద్యార్థులకు భోజనం పెట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతుంటే, మరో పక్క డైలీవేజ్,ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మెతో అధికా రులపై భారం పడుతోంది. ప్రస్తుతం వంట చేసేందుకు, ఇతర పనులకు వసతిగృహ సంక్షేమ అధికారు లే సొంత ఖర్చుతో కూలీలను సమకూర్చుకుంటున్నా రు. ఈ అంశంపై ఆయా శాఖల అధికారులను వివరణ కోరగా.. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాగానే మెస్ చార్జీలు చెల్లిస్తామని వెల్లడించడం గమనార్హం.
పోస్టు మెట్రిక్ వసతిగృహాలు 11
విద్యార్థుల సంఖ్య 1,600
ప్రీ మెట్రిక్ వసతిగృహాలు 41
విద్యార్థుల సంఖ్య 3,100
ఏప్రిల్ నుండి రావాల్సిన డైట్ చార్జీలు రూ.3,74,02,500
పోస్టు మెట్రిక్ వసతిగృహాలు 11
విద్యార్థుల సంఖ్య 1,250
ప్రీ మెట్రిక్ వసతిగృహాలు 20
విద్యార్థుల సంఖ్య 1,700
ఏప్రిల్ నుండి రావాల్సిన డైట్ చార్జీలు రూ.2,49,47,500
పోస్టు మెట్రిక్ వసతిగృహాలు 12
జనరల్ వసతిగృహాలు 08
ఆశ్రమ పాఠశాలలు 10
మొత్తం విద్యార్థుల సంఖ్య 4,500
ఏప్రిల్ నుండి రావాల్సిన డైట్ చార్జీలు రూ.5,71,00,000