
కొబ్బరికాయ ధరలకు రెక్కలు
ఖమ్మంగాంధీచౌక్: కొబ్బరికాయల ధరలకు రెక్కలొచ్చాయి. శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండడం, దసరా సమీపించిన నేపథ్యాన కొబ్బరి కాయలకు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రాంతాలు, కాయ సైజు ఆధారంగా ఒక్కో కొబ్బరికాయను రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. కార్పొరేట్ మాల్స్‌లో రూ.40 చొప్పున విక్రయిస్తుండగా, రిటైల్ దుకాణాల్లో రూ.45, గ్రామాల్లో రూ.50కి అమ్ముతున్నారు. అంతేకాక ఆలయాల వద్ద ఈ ధరలు మరింత ఎక్కువ ఉంటున్నాయి. నిన్నామొన్నటి వరకు వినియక చవితి ఉత్సవాలు సాగగా, ప్రస్తుతం శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండడం.. మరోపక్క భక్తులు భవానీ దీక్ష, అయ్యప్ప దీక్ష ధరిస్తుండడంతో కొబ్బరికాయలకు డిమాండ్ పెరిగింది. ఏపీలోని గోదావరి జిల్లాలు, కేరళ రాష్ట్రం నుంచి ఖమ్మంలోని హోల్‌సేల్ వ్యాపారులు దిగుమతి చేసుకుని సైజు ఆధారంగా గ్రేడింగ్ అనంతరం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు సరఫరా చేస్తున్నారు.
దిగుబడి తగ్గడంతో..
కొబ్బరి పంట దిగుబడి ఆశించిన మేర లేకపోవడంతోనే డిమాండ్ పెరిగిందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు ఆద్యాత్మిక కార్యక్రమాల్లో వినియోగం పెరగడం ఇంకో కారణంగా చెబుతున్నారు. గోదావరి జిల్లాలు, కేరళ రాష్ట్రానికిఆర్డర్ చేసినా సమయానికి రావడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు.
పండుగ వేళ రూ.40కి పైగానే విక్రయం