
స్థానిక సమరంలో సత్తా చాటుదాం
ఖమ్మంమయూరిసెంటర్: స్థానిక సమరంలో సత్తా చాటేలా పార్టీ నాయకత్వం, కార్యకర్తలు కృషి చేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు పిలుపునిచ్చారు. ఎన్నికలు జరుగుతాయా, లేదా అన్న మీమాంసను పక్కనపెట్టి అభ్యర్థుల ఎంపికలో నిమగ్నం కావాలని సూచించారు. సీపీఐ జిల్లా సమితి సమావేశం మంగళవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఏపూరి లతాదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో హేమంతరావు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణను సీపీఐ స్వాగతిస్తుండగా, రిజర్వేషన్లకు అనుగుణంగా పనిచేయడంతో పాటు కలిసొచ్చే రాజకీయ పార్టీలతో కలిసి సంప్రదింపులు జరపాలని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు నాయకత్వంతో సంప్రదిస్తూ అభ్యర్థులను ఎంపిక చేయాని సూచించారు. కాగా, పార్టీ శతజయంతి ఉత్సవ ముగింపు సభ డిసెంబర్ 26న జరగనుండగా, ఈనెల 5న ఖమ్మంలో ఆహ్వాన సంఘం సమావేశం నిర్వహిస్తున్నట్లు హేమంతరావు తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్ కార్యక్రమాల నివేదికతో పాటు జిల్లాలో పోటీ చేయాల్సిన స్థానాల వివరాలను ప్రవేశపెట్టారు. పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా సమితి సమావేశంలో బాగం