విద్యుత్‌ శాఖకు బకాయిల షాక్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ శాఖకు బకాయిల షాక్‌

Sep 30 2025 7:57 AM | Updated on Sep 30 2025 7:57 AM

విద్య

విద్యుత్‌ శాఖకు బకాయిల షాక్‌

● జిల్లాలో బకాయిలు రూ.143కోట్లకు పైగానే.. ● వసూళ్ల బాధ్యత సిబ్బందికి అప్పగింత.. ● వినియోగదారుల్లో అవగాహనకు మైకులతో ప్రచారం

ప్రత్యేక కార్యాచరణతో ముందుకు...

● జిల్లాలో బకాయిలు రూ.143కోట్లకు పైగానే.. ● వసూళ్ల బాధ్యత సిబ్బందికి అప్పగింత.. ● వినియోగదారుల్లో అవగాహనకు మైకులతో ప్రచారం

ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో విద్యుత్‌ బిల్లు బకాయిలు నానాటికీ పెరుగుతున్నాయి. వివిధ కేటగిరీల్లో విద్యుత్‌ వినియోగానికి సంబంధించి బకాయిలు రూ.కోట్లలోకి చేరడంతో వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. జిల్లాలో ఎనిమిది కేటగిరీల్లో సుమారు 7 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా.. ఇందులో దాదాపు 5లక్షలు గృహ సర్వీసులు, 1.20 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అలాగే, పరిశ్రమలవి 66 లక్షలు, ఇతరత్రా మరో 13 లక్షల వరకు ఉన్నాయి. అయితే, 5లక్షల గృహ సర్వీసుల్లో 2.88 లక్షల సర్వీసులు గృహజ్యోతి పథకంలో కొనసాగుతుండగా, మరికొందరు తెల్ల రేషన్‌ కార్డుదారులు సైతం గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా తమకు ఉచిత విద్యుత్‌ అందుతుందనే భావనతో నెలనెలా బిల్లులు చెల్లించడం లేదు. మిగిలిన కేటగిరీల్లో బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు వసూళ్ల బాధ్యతను ఉద్యోగులు, సిబ్బందికి అప్పగించి మైకుల్లో ప్రచారం చేస్తున్నారు.

ప్రభుత్వ శాఖలవే అధికం

జిల్లాలో 2025 జూలై 31నాటికి విద్యుత్‌ బకాయిలు రూ.143.32 కోట్ల మేర పెండింగ్‌ ఉన్నాయి. ఆతర్వాత ఆగస్టు వరకు లెక్కిస్తే ఈ బకాయి మరింత పెరిగే అవకాశముంది. ఇందులో అధికంగా ప్రభుత్వ శాఖలవే ఉండడం గమనార్హం. గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీల్లో వీధిలైట్లు, వాటర్‌ వర్క్స్‌ అంశాల్లో రూ.83.21 కోట్ల బకాయి ఉండగా.. కేటగిరీ–2లో గృహేతర, వాణిజ్య సర్వీసుల బకాయిలు రూ.30.39 కోట్లు పేరుకుపోయాయి. ఇక గృహాలకు సంబంధించి రూ.13.65 కోట్లు, వ్యవసాయ కనెక్షన్ల బకాయి రూ.11.66 కోట్లు ఉండడంతో వసూళ్లపై విద్యుత్‌ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

సెక్షన్ల వారీగా బాద్యతలు

బకాయిల వసూళ్లకు విద్యుత్‌ శాఖ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా విద్యుత్‌ సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది. బకాయి జాబితాలను సెక్షన్ల వారీగా అందించి వినియోగదారుల వద్దకు వెళ్లి బిల్లు చెల్లించేలా అవగాహన కల్పించాలని సూచించారు. దీంతో లైన్‌మెన్లు మొదలు ఆపై ఉద్యోగులు బకాయి జాబితాలతో వినియోగదారులు కలుస్తున్నారు. బకాయి పేరుకుపోతే ప్రతీనెల 6 శాతం వడ్డీ పడుతుందని, తద్వారా బిల్లు పెరుగుతుందని చెబుతూ చెల్లించేలా అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక గృహజ్యోతిపైనా వినియోగదారుల్లో సందేహాలను నివృత్తి చేస్తున్నారు. దీనికి తోడు పలు ప్రాంతాల్లో బిల్లు బకాయి చెల్లించాలని సిబ్బంది మైకుల్లో ప్రచారం చేస్తున్నారు.

కేటగిరీల వారీగా విద్యుత్‌ బకాయిలు (రూ. కోట్లలో)

కేటగిరీ బకాయి

కేటగిరీ–1 (గృహాలు) 13.65

కేటగిరీ–2 (వాణిజ్య/గృహేతర) 30.39

కేటగిరీ–3 (ఎల్‌టీ ఇండస్ట్రీ) 3.18

కేటగిరీ–4 (కాటేజెస్‌ ఇండస్ట్రీస్‌) 0.01

కేటగిరీ–5 (వ్యవసాయ) 11.66

కేటగిరీ–6 (జీపీలు, మున్సిపాలిటీలు) 83.21

కేటగిరీ–7 (పాఠశాలలు, ఆలయాలు) 0.97

కేటగిరీ–8 (తాత్కాలిక సరఫరా) 0.25

మొత్తం 143.32

విద్యుత్‌ బిల్లు బకాయిలు వసూలు చేసేలా ప్రత్యేక దృష్టి సారించాం. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. విద్యుత్‌ సరఫరాతో పాటు బిల్లుల వసూలు బాధ్యత మా శాఖపై ఉంది.. వివిధ కేటగిరీల్లో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేసేలా సిబ్బంది కృషి చేస్తున్నారు.

– ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్‌ఈ, ఎన్పీడీసీఎల్‌

విద్యుత్‌ శాఖకు బకాయిల షాక్‌1
1/1

విద్యుత్‌ శాఖకు బకాయిల షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement