
తేలిన ‘పంచాయతీ’
● సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు ● గ్రామాల్లో ప్రారంభమైన సందడి
ఖమ్మం సహకారనగర్ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు శనివారం ప్రకటించగా.. సర్పంచ్, వార్డులు, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు తమ గ్రామం, వార్డు, ఎంపీటీసీ స్థానం ఎవరికి రిజర్వ్ అవుతుందోనని పల్లె ప్రజలు ఆతృతగా ఎదురుచూడగా, ఈ రిజర్వేషన్ల ప్రక్రియతో గ్రామాల్లో ఎన్నికల సందడి మరింత ఊపందుకోనుంది.
571 జీపీలు, 283 ఎంపీటీసీలు..
జిల్లాలో 571 గ్రామ పంచాయతీలు, 5,214 వార్డులు, 283 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఇందులో షెడ్యూల్, నాన్ షెడ్యూల్ ఏరియా ల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు చేశారు. బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుండగా ఆ ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు. రిజర్వేషన్ల ప్రకటనతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.