
వాణిజ్య పంటలకు స్వస్తి..
● పందిరి కూరగాయల సాగుతో అధిక లాబాలు ● డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అంతరపంటల సాగు ● దశాబ్దకాలంగా ఉద్యానవన పంటలు పండిస్తున్న రైతులు ● పొరుగు రాష్ట్రాలకు వెళ్లి సాగు పద్ధతుల పరిశీలన
బోనకల్: పెరిగిన ఖర్చులు, తగ్గుతున్న దిగుబడులు, గిట్టుబాటు ధర లేకపోవడంతో వాణిజ్య పంటలకు స్వస్తి చెప్పి ఉద్యానవన పంటలు సాగుచేస్తూ దశాబ్ద కాలంగా లాభాలు గడిస్తున్నారు. మండలంలోని ముష్టికుంట్ల గ్రామంలో సుమారు 30 మంది రైతులు ఉద్యానవన పంటలను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తమకు ఉన్న కొద్దిపాటి భూముల్లో కాలానుగుణంగా ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటల దిగుబడి తగ్గడంతో పాటు గిట్టుబాటు ధర లేకపోవడం, సేద్యానికి అయ్యే ఖర్చు పెరగడం, చీడపీడలు ఆశించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో వినూత్న రీతిలో కూరగాయల సాగుతో పాటు బంతి, చామంతి, కనకాంబరాలు, గులాబీ, లిల్లీలు, పండ్ల తోటలైన జామ, బొప్పాయి పంటలను అంతర పంటలుగా సాగు చేస్తున్నారు.
పందిరి విధానంతో..
తొలకరి జల్లులు పడగానే పత్తివేసే సమయంలో పందిరి విధానంలో కాకర, బీర, దొండ పంటలు వేస్తున్నారు. ప్రస్తుతం కాకర నెల రోజుల నుంచి కోస్తున్నారు. వేసిన 40 రోజుల తరువాత పంట చేతికి వస్తుంది. మొత్తం 90 రోజుల్లో పంట దిగుబడి కాలం పూర్తి అవుతుంది. విత్తనాలను బెంగళూరు నుంచి హైబ్రీడ్ రకం తెప్పించి విత్తారు. ఎకరం బీర, దొండ, కాకర విత్తనాలను కొనుగోలు చేయడానికి రూ.10 – రూ.15 వేలు ఖర్చు వస్తున్నట్లు రైతులు తెలిపారు. పశువుల ఎరువులు, ఇతర పురుగుమందులకు ఎకరానికి రూ.25 వేలు, కూలీలు, ఇతర ఖర్చులు రూ.30 వేలు అవుతున్నట్లు రైతులు తెలిపారు. ఇప్పటివరకు ఎకరాకు 80 క్వింటాళ్లకు పైగా దిగుబడి రావడంతో మండలంలోని పలు గ్రామాల వ్యాపారులతో పాటు ఖమ్మం మార్కెట్‌కు తరలిస్తున్నారు. సీజన్ పూర్తి అయ్యే వరకు ఎకరానికి రూ.3 లక్షల ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు. బీర, బెండ, దొండ, కాకర పూర్తయిన తరువాత అదే భూమిలో టమాట సాగు చేస్తామని రైతులు తెలిపారు.
అంతర పంటల సాగు
రైతులు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా అంతర పంటలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది బంతిలో అంతర పంటగా బొప్పాయి, గులాబీలో మల్లెలు సాగు చేస్తున్నారు. బంతి 120 రోజుల వ్యవధిలో పెట్టుబడి పోను రూ.లక్ష ఆదాయం వస్తుంది. ప్రస్తుతం వంగ సాగుకు సంబంధించి కింద అడవి వంగ, పైన గ్రాప్టింగ్, అంకూర్ నితీశ్ వంటి వైరెటీ వంగ మొక్కలను హైదరాబాద్‌లోని ఉద్యానవన నర్సరీ నుంచి తెప్పించి సాగు చేస్తున్నారు. ఇది గత ఏప్రిల్‌లో వేయగా జూన్ 12 నుంచి కోత కోస్తున్నారు. వారానికి 10 క్వింటాళ్ల చొప్పున కోత కోస్తున్నారు. మొత్తం రూ.3 లక్షల వరకు ఆదాయం రాగా ఖర్చు రూ.1.5 లక్షలు పోతుందని వివరించారు.

వాణిజ్య పంటలకు స్వస్తి..