
వ్యవసాయ మార్కెట్ తనిఖీ
వైరా: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ను రాష్ట్ర గిడ్డంకుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఆదివారం తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్నబియ్యాన్ని పరిశీలించారు. చౌకదుకాణాలకు సరఫరా చేసే సన్నబియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, టీపీసీపీ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వికాస వేదిక నూతన కమిటీ ఏర్పాటు
ఖమ్మంగాంధీచౌక్: వికాస వేదిక సాహిత్య సంస్థ నూతన కమిటీని ఆదివారం ఖమ్మంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గాజుల భారతి శ్రీనివాస్, కార్యదర్శిగా తిరునగరి శ్రీనివాసరావు, కోశాధికారిగా సునీత, గౌరవాధ్యక్షులుగా తులసీదాస్, ఉపాధ్యక్షులుగా మలిశెట్టి కృష్ణమూర్తి, ఐలయ్య, బి నాగేశ్వరరావు, చిన్న హుస్సేన్, పుల్లయ్య, వసంత, సహాయ కార్యదర్శులుగా కట్టెకోల చిన్న నర్సయ్య, నల్ల కృష్ణ, శైలజ, శోభనాద్రి వీరబాబు, సంగమేశ్వరరావు, అధికార ప్రతినిధులుగా కె. కృష్ణారావు, గోవింద్, న్యాయ సలహాదారుగా సాయి శ్రీనిజ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి బుక్క తస్యనారాయణ అధ్యక్షత వహించగా, నామవరపు కాంతేశ్వరరావు, లెనిన్ శ్రీనివాస్, సాధనాల వెంకటస్వామి నాయుడు, శంకర్ రెడ్డి, వెంకటకృష్ణ, ఆవుల వీర భద్రం, విజయరామరాజు, జయవాసు, రామయ్య, జహీరుద్దీన్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి పోటీల్లో మధిర కళాకారులు
మధిర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలిలో కళల కాణాచి సంస్థ నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పద్య నాటక పోటీల్లో మధిర సుమిత్ర యూత్ అసోసియేషన్ కళాకారులు ఆదివారం ప్రదర్శించిన కస్తూరి తిలకం పద్య నాటకం అలరించింది. ఈనెల 27 నుంచి అక్టోబర్ 2 వరకు తెనాలిలో జాతీయస్థాయి పద్య నాటక పోటీలు జరుగుతున్నాయి. ఈ పద్య నాటకానికి డాక్టర్ నిభానుపుడి సుబ్బరాజు దర్శకత్వం వహిస్తూ సోమగిరి పాత్ర ధరించారు. బిల్వమంగళుడిగా చిలువేరు శాంతయ్య, స్థానాపతిగా నరాల సాంబశివారెడ్డి, కాకతీయ రాజుగా రామవరం ప్రసాద్‌తో పాటు కిషోర్ రెడ్డి, రాజేశ్వరరావు, ఇనపనూరి వసంత్ వివిధ పాత్రలు ధరించారు. ప్రముఖ సినీ సంభాషణ రచయిత బుర్ర సాయిమాధవ్ కళాకారులను అభినందించారు.
షిరిడీలో బోనకల్ వాసి ఆత్మహత్య
బోనకల్: మండలంలోని రాయన్నపేట గ్రామానికి చెందిన యువ వైద్యుడు మహారాష్ట్రలోని షిరిడీలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన మరీదు కిశోర్ – కోటేశ్వరి దంపతుల ఏకై క కుమారుడు వినోద్ (30) రష్యా లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. పెడియాట్రిక్‌లో ఎండీ చేసేందుకు గాను మహారాష్ట్రలోని షిరిడీలో ఓ ప్రైవేట్ వైద్య కళా శాలలో చేరాడు. 6 నెలల్లో కోర్సు పూర్తికానుంది. వైద్య కళాశాలలో కొందరు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురైన వినోద్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడిని వైద్యుడిగా చూసుకుందామనుకున్న తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. మృతదేహాన్ని రాయన్నపేటకు తీసుకొస్తున్నారు.

వ్యవసాయ మార్కెట్ తనిఖీ