
సైబర్ మోసం కేసులో నిందితుడి అరెస్ట్
ఖమ్మంక్రైం: ఆన్‌లైన్‌లో ట్రేడింగ్‌లో డబ్బు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి సుమారు రూ.11లక్షల మేర మోసం చేసిన ఘటనలో ఓ వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. సత్తుపల్లి మండలానికి చెందిన ఓ సివిల్ ఇంజనీర్‌కు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఆన్‌లైన్‌లో ట్రేడింగ్‌లో లాభాలు వస్తాయని నమ్మించారు. ఆపై విడతల వారీగా రూ.11లక్షలు తీసుకోగా, బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈమేరకు బాధితుడి నగదులో రూ.2లక్షలు లక్కిరెడ్డి హరిప్రసాద్‌రెడ్డి ఖాతాలో జమ అయినట్లు గుర్తించి రంగారెడ్డి జిల్లా మణికొండలో శనివారం అరెస్ట్ చేశామని సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణీందర్ తెలిపారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐలు రంజిత్‌కుమార్, విజయ్‌కుమార్, కానిస్టేబుళ్లు కృష్ణారావు, కిషన్‌రావును సీపీ సునీల్‌దత్ అభినందించారు.
సైబర్ మోసాలకు గురైన యువకులు
రఘునాథపాలెం/ఖమ్మం అర్బన్: స్వల్ప పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించిన సైబర్ మోసగాళ్లు ఓ యువకుడిని మోసం చేశారు. రఘునాథపాలెం మండలం ఎన్వీ బంజరుకు చెందిన ధరావత్ వెంకటేశ్ సామాజిక మాధ్యమంలో కనిపించిన ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. ఆపై రూ.17,500 పెట్టుబడి పెడితే రోజుకు రూ.500 చొప్పున ఏడాది పాటు ఇస్తామనే ప్రకటన నమ్మి ఆయనతో పాటు బంధువులతో గత ఆగస్టులో పెట్టుబడి పెట్టించాడు. అనంతరం యాప్ పనిచేయక పోవడంతో తొమ్మిది మంది రూ.1.45 లక్షలు మోసపోయినట్లు గుర్తించి శనివారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశామని రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. అలాగే, ఖమ్మం శ్రీరాంహిల్స్‌కు చెందిన కిరణ్‌కుమార్ ఈనెల 14న హైదరాబాద్ నుంచి వస్తూ చిట్యాల వద్ద టిఫిన్ చేశాడు. అక్కడ బిల్ చెల్లింపునకు ఫోన్‌పే యాప్ ఉపయోగించగా, అదే రోజు రాత్రి ఆయన రెండు ఖాతాల నుంచి రూ.52వేలు విత్‌డ్రా అయ్యాయి. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు.