
అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని ధర్నా
మధిర: అర్హులైన వారికి కాక అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని సీపీఎం నాయకులు, చిలుకూరు గ్రామస్తులు శనివారం మధిర మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మందా సైదులు, శీలం నరసింహారావు, పాపినేని రామనరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలు, అద్దె ఇంట్లో నివాసం ఉండే వారికి ఇళ్లు మంజూరు చేయాల్సి ఉండగా ఎంపీడీఓ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. చిలుకూరు గ్రామంలో ఇల్లు ఉన్న వారికే కేటాయించగా నిరుపేదలకు నష్టం జరిగిందని తెలిపారు. అంతేకాక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాదనే కారణంతో 34మందికి మొండిచేయి చూపారని విమర్శించారు. ఎంపికలో వసూళ్లకు పాల్పడిన వారి వివరాలు సమర్పించినా ఎంపీడీఓ చర్యలు తీసుకోకపోగా, ఒంటరి మహిళ పేరును అర్హుల జాబితా నుంచి తొలగించారని చెప్పారు. నాయకులు శంకర్‌రావు, శ్రీరాములు, వెంకటనరసయ్య, రామకిషోర్, లాలు, ధనలక్ష్మి, గోపీనాథ్, మీరాబీ, వజ్రమ్మ, సైదమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.