
అవినీతి రహిత సమాజమే ఆర్‌టీఐ లక్ష్యం
నేలకొండపలి: అవినీతి రహిత సమాజమే సమాచార హక్కు చట్టం లక్ష్యమని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పీ.వీ.శ్రీనివాస్ తెలిపారు. నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రాన్ని శనివారం సందర్శించిన ఆయన అక్కడ చరిత్ర తెలిపే బోర్డులు తుప్పుపట్టడం, చెట్లు పెరిగి ఉండడాన్ని గుర్తించారు. అనంతరం స్థానిక సిద్ధార్థ యోగా ఆశ్రమం వద్ద శ్రీనివాస్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా రాష్ట్రంలో 17వేల కేసులు పెండింగ్ ఉండగా... 13జిల్లాలో పర్యటించి 7వేలకు పైగా పరిష్కరించామని తెలిపారు. తద్వారా పది జిల్లాలో ఒక్క కేసు లేదని చెప్పారు. వచ్చేనెల 3నుంచి సమాచార హక్కు చట్టం వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, ఎంతో చరిత్ర కలిగిన బౌద్ధక్షేత్రాన్నిమరింత అభివృద్ధి చేసేలా మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని శ్రీనివాస్ వెల్లడించారు. తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు, ఎంఆర్‌ఐ ఆలస్యం రవి తదితరులు పాల్గొన్నారు.