
బీసీల రిజర్వేషన్లపై కేంద్రం నిర్లక్ష్యం
దీక్షకు మద్దతు
● జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ● కలెక్టరేట్ ఎదుట ఆమరణ దీక్ష.. విరమింపచేసిన పోలీసులు
ఖమ్మం మామిళ్లగూడెం: బీసీల రిజర్వేషన్ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్ ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో ఆయనతో పలువురు నాయకులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ఆమరణ దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలు రాజకీయ, ఉద్యోగ రంగాల్లో నష్టపోకుండా తక్షణమే రిజర్వేషన్లు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు బీజేపీ ఎంపీలతో పాటు అన్ని పార్టీల నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కాగా, దీక్షకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీసీ సంఘాల నాయకులు డాక్టర్ దయానంద్, నీరజాదేవి, దోమ ఆనంద్‌బాబు, సుజలాదేవి, పుచ్చకాయల వీరభద్రం, గుండాల కృష్ణ, బొమ్మ రాజేశ్వరరావు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ కేవీ.కృష్ణారావు తదితరులు సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాగమయి, డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉందని తెలిపారు. అలాగే, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు కత్తి నెహ్రూగౌడ్, పెళ్లూరి విజయ్‌కుమార్, తాటి వెంకటేశ్వర్లు, చిట్టోజు రమేష్, పుల్లయ్య, వరలక్ష్మి, మేడేపల్లి కృష్ణమాచారి, లింగనబోయిన పుల్లారావు, మసనం శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా, శిబిరం వద్దకు రఘునాథపాలెం పోలీసులు చేరుకుని దీక్షను విరమింపచేశారు.
కల్లూరు/కల్లూరు రూరల్: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ చేపట్టిన ఆమరణ దీక్షకు కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈఏరకు కల్లూరు నుంచి కాంగ్రెస్, బీసీ సంఘం నాయకులు లక్కినేని కృష్ణ, పెద్దబోయిన శ్రీనివాసరావు, రాజబోయిన శ్రీనివాసరావు, మట్టా రామకృష్ణ, తోట సుబ్బారావు, పొన్నూరు వెంకటేశ్వరరావు, ఆళ్లకుంట నరసింహారావు, కొడవటి వెంకటేశ్వరరావు, రాచపోయిన శ్రీను, సుబ్బారావు హాజరయ్యారు.