
మళ్లీ సమ్మెబాట
కేంద్రం స్పందించాలి..
● కమీషన్ కోసం రేషన్ డీలర్ల నిర్ణయం ● స్పందించకపోతే వచ్చే నెల షాప్‌లు తెరవబోమని వెల్లడి ● రాష్ట్రం నిధులు వచ్చినా.. కేంద్రం నుంచి బకాయి
ఖమ్మం సహకారనగర్: రేషన్ డీలర్లు తమకు రావాల్సిన కమీషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనెల 30వ తేదీ వరకు బకాయిలు విడుదల చేయకపోతే వచ్చేనెల షాప్‌లు తెరిచేది లేదని స్పష్టం చేశారు. ఈమేరకు వచ్చే నెల 1, 2వ తేదీల్లో ఉపవాస దీక్షలు చేపడుతామని, ఆతర్వాత 3వ తేదీ నుంచి దుకాణాలు బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
రూ.5కోట్ల మేర బకాయి
జిల్లాలోని 21 మండలాల పరిధిలో 748 రేషన్ షాప్‌లు ఉన్నాయి. ఆయా షాప్‌ల డీలర్లకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలలు కమీషన్ అందాల్సి వస్తుంది. ప్రతీనెల కమీషన్ ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. క్వింటా బియ్యం ఇచ్చినందుకు కమీషన్‌గా రూ.140 ఇస్తుండగా అందులో కేంద్రం వాటా రూ.90, రాష్ట్రం వాటా రూ.50గా ఉంది. మొత్తంగా జిల్లా డీలర్లకు రూ.5కోట్ల మేర కమీషన్ బకాయి ఉన్నట్లు సమాచారం. ఇటీవల డీలర్లు సమ్మె చేస్తామని హెచ్చరించడంతో రాష్ట్రప్రభుత్వం తన ఐదు నెలల వాటాను గత నెల చివరలో విడుదల చేసింది. కానీ కేంద్రం నిధులు రాకపోవడంతో డీలర్ల ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఈ నేపథ్యాన వచ్చే నెలలో సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు.
ఇటీవల రాష్ట్రప్రభుత్వం కమీషన్ నిధులు విడుదల చేసింది. కేంద్రం కూడా
తక్షణమే విడుదల చేయాలి. కమీషన్ అందక డీలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీలర్ల సమస్యలను గుర్తించి కేంద్రప్రభుత్వం ఇకనైనా
స్పందించాలి.
– బి.వెంకన్న, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు

మళ్లీ సమ్మెబాట