
లైసెన్సా.. మాకెందుకు?
పంట మద్దతు ధరలు ఇలా ..
● మార్కెట్ల పన్ను ఎగవేతకు కొందరి పన్నాగం ● ఫలితంగా రైతులకు మద్దతు ధరలో నష్టం ● ఏటా రెన్యూవల్‌కు పలువురి విముఖత
గ్రామగ్రామాన పంటలు కొనుగోలు చేసే వ్యాపారులందరికీ లైసెన్సులు ఉండాలి. మార్కెట్లలో క్రయ విక్రయాలు జరిగేలా చూడాలి. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు లభించేలా చూడాలి. అధికారులు రైతులకు న్యాయం జరిగేలా పంటల మద్దతు ధరలు అమలయ్యేలా చూడాలి.
–ఉపేందర్, బొజ్జాయిగూడెం, ఇల్లెందు మండలం
ఇల్లెందు మార్కెట్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. వాటి పరిధిలో 70మంది వ్యాపారులకు లైసెన్సులు ఉన్నాయి. అన్ని లైసెన్సులు రెన్యూవల్ అయ్యేలా చూస్తున్నాం. వ్యాపారం చేసే ప్రతీ ఒక్కరికి లైసెన్సు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. క్రయవిక్రయాల లెక్కలు పక్కాగా రాసేలా చూస్తున్నాం.
–ఇ.నరేశ్, మార్కెట్ కార్యదర్శి, ఇల్లెందు
ఇల్లెందు: వ్యాపారం చేయాలంటే అనుమతి ఉండాలి. అందుకు క్రయవిక్రయ అనుమతి లైసెన్సు పొందాలి. పొందిన లైసెన్సుకు ఏటా ఏఏ పంట ఎంత కొనుగోలు చేశారో మార్కెట్ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత వచ్చే ఏడాది క్రయ విక్రయాలకు మళ్లీ రెన్యూవల్ చేసుకోవాలి. ఇదీ తంతు.. కానీ, చాలా మంది వ్యాపారులు ఒక దఫా మార్కెట్ యార్డు కార్యాలయం నుంచి లైసెన్సు తీసుకుని రెన్యూవల్ చేయించుకోకుండా అదే లైసెన్సు పేరుతో వ్యాపారం సాగిస్తున్నారు. ఇక ఏఏ పంట ఎంత? ఏ రైతు వద్ద ఏ పంట కొనుగోలు చేసింది? కొనుగోలు చేసిన పంటను ఏ వ్యాపారికి విక్రయించింది? లాంటి సమాచారం రిజిస్టర్‌లో నమోదు చేయరు. కనీసం ఏ పంటకు ఎంత మద్దతు ధర చెల్లించారో కూడా ఎక్కడా నమోదు చేయరు. ఇలా లైసెన్సులు రెన్యూవల్ చేసుకోకుండా దర్జాగా మార్కెట్‌లో వ్యాపారం చేసే వారు కోకోల్లలు. మార్కెట్ శాఖ పర్యవేక్షణ లేకపోవటం వల్ల ఈ దుస్థితి వచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉన్నా ఇంతవరకు ఒక్క దఫా మార్కెట్‌ల పరిస్థితిపై సమీక్ష నిర్వహించలేదు.
జిల్లాలో 141 మంది లైసెన్సుదారులు
జిల్లాలో ఆరు వ్యవసాయ మార్కెట్‌లలో 141 మంది లైసెన్సు పొందిన వ్యాపారులు ఉండగా ఇల్లెందులోనే 70 మంది వరకు ఉన్నారు. ఇక ఊరుకు 10 మందికి పైగా అనుమతి లేని జీరో వ్యాపారం చేసే వారే ఉన్నారు. వీరిలో చాలా మంది గతంలో లైసెన్సు తీసుకుని రెన్యూవల్ చేసుకోని వారు కూడా జీరో దందాలో ఉన్నారు. పేరుకు వ్యాపారులకు అనుమతులుంటాయి. కానీ, చాలామంది క్రయవిక్రయాలు నమోదు చేయరు. ఏడాది మొత్తం వ్యాపారం చేస్తారు. మార్కెట్ ఫీజు ఎగనామం పెట్టేందుకు రిజిస్టర్లు ఉండవు. రైతుల పేరుతో రశీదులు సృష్టించి ఎగుమతులు చేసుకుంటున్నారు. శాఖల మధ్య సమన్వయం లేక మార్కెట్ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. వ్యాపారులకు వ్యవసాయ శాఖ పంట పండినట్లు ఒక రశీదు ఇస్తుంది. ఆ రైతు భూమి నుంచి పండిన పంటనే తరలించుకుపోతున్నట్లు రెవెన్యూ శాఖ మరో రశీదు ఇస్తుంది. ఒక్కోసారి చెక్ పోస్టుల్లో కూడా ఏమీ చేయలేకపోతున్నారు. జీరో దందాకు చెక్ పెడితే మార్కెట్ ఆదాయం పెరుగుతుంది.
సీజనల్‌గా సాగే మార్కెట్లుగా..
జిల్లాలో 5,92,264 ఎకరాల్లో పంటల సాగు జరిగింది. 1,39,169 మంది రైతులు ఉన్నారు. వరి 42 వేల ఎకరాలు, పత్తి 2.11 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 84 వేల ఎకరాలు, పెసర 346 ఎకరాలు, కంది 1,071 ఎకరాల్లో సాగు చేశారు. జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్లను సీజనల్‌గా సాగే మార్కెట్లుగా మార్చారు. ఏడాది పొడవునా ఏఒక్క మార్కెట్‌లో క్రయవిక్రయాలు సాగడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం సాంధించాలంటే కేవలం చెక్‌పోస్టులను వాడుకుంటున్నారు. భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, దమ్మపేట, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, ఇల్లెందు మార్కెట్ యార్డులు ఉన్నాయి. 2025 – 26 ఏడాదికి జిల్లా లక్ష్యం రూ.22 కోట్లుగా నిర్ణయించారు. ఆదాయం కోసం చెక్ పోస్టుల్లో ప్రైవేట్ గార్డులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా రాబడుతున్నారు. ఇక అధికారులంతా కాలక్షేపం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
గత ఏడాది లక్ష్యం ఇలా..
బూర్గంపాడు రూ.6. 25 కోట్లు, దమ్మపేట రూ. 3.67 కోట్లు, ఇల్లెందు రూ.5.16 కోట్లు, భద్రాచలం రూ.1.94 కోట్లు కొత్తగూడెం రూ. 3.47 కోట్లు, చర్ల రూ.2.12 కోట్లు సాధించారు.
క్వింటా ధాన్యం (సాధారణ) రూ.2,369, ధాన్యం (గ్రేడ్–ఏ) రూ.2,389, మొక్కజొన్న రూ.2,400, పత్తి (పొడవైన) రూ.7,710, పత్తి (మధ్యస్థ) రూ.8,110, జొన్నలు (హైబ్రిడ్) రూ.3,699, జొన్నలు (మాల్దండి) రూ.3,749, సజ్జలు రూ.2,775, రాగులు రూ.4,886, కందులు రూ.8 వేలు, పెసలు రూ.8,768, మినుములు రూ.7,800, వేరుశనగ రూ.7,263, పొద్దు తిరుగుడు రూ.7,720, సోయాబీన్ రూ.5,328, నువ్వులు రూ.9,846గా ఉన్నాయి.

లైసెన్సా.. మాకెందుకు?

లైసెన్సా.. మాకెందుకు?

లైసెన్సా.. మాకెందుకు?