
చిగురిస్తున్న ఆశలు..
‘పీఎం స్వనిధి’ ద్వారా
వీధి వ్యాపారులకు రుణాలు
లోక్ కల్యాణ్ మేళాల ద్వారా మంజూరు
‘మెప్మా’ ఆధ్వర్యాన కార్యాచరణ ఖరారు
ఖమ్మంమయూరిసెంటర్: పీఎం స్వనిధి పథకం వీధి వ్యాపారుల జీవితాల్లో నూతన అధ్యాయాన్ని సృష్టిస్తోంది. ఈ పథకం కేవలం ఆర్థిక సాయం అందించడమే కాకుండా, వృత్తిపరంగా, సాంకేతికంగా వారి వ్యాపారాలను అభివృద్ధి చేసేందుకు తోడ్పడుతుంది. ఈ పథకం కింద వీధి వ్యాపారులు సులభంగా రుణాలు పొందేలా ప్రభుత్వం ‘లోక్ కల్యాణ్ మేళా’ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా జిల్లాలోని ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు మధిర, సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులకు రుణం ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు.
వ్యాపారులకు దన్నుగా నిలిచేలా..
వీధి వ్యాపారాలు చేసుకునే వారికి ప్రభుత్వం దున్నగా నిలిచేలా లోక్ కల్యాణ్ మేళా నిర్వహణకు సన్నాహాలు చేసింది. గతంలో ఈ మేళా నిర్వహించినప్పటికీ కొంత కాలంగా నిలిచిపోయింది. తిరిగి ఈ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వీధి వ్యాపారులకు రుణాలు అందించాలని నిర్ణయించింది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యాపారులకు మాత్రమే రుణాలు ఇచ్చేలా లక్ష్యాలను నిర్దేశించారు. మొదటిసారి రుణం తీసుకునేవారికి రూ.15,000, సకాలంలో తిరిగి చెల్లించే వారికి రెండోసారి రూ.25,000, మూడోసారి తీసుకునేవారికి రూ.50,000 వరకు రుణాలు మంజూరు చేస్తారు. అత్యంత తక్కువ వడ్డీ రేటుతో, ఎలాంటి హామీ లేకుండా రుణాలివ్వడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇక రూ.50 వేల పైగా రుణం తీసుకుని చెల్లించిన వారికి క్రెడిట్ కార్డులు అందజేయనున్నారు. ఈ కార్డుల ద్వారా రూ.30 వేల వరకు వినియోగించుకునే అవకాశం ఉంది. తద్వారా వీధి వ్యాపారులను వడ్డీల పేరుతో దోపిడీ నుంచి కాపాడి, స్వతంత్రంగా ఎదగడానికి అవకాశం కల్పించనుంది.
సాంకేతికతతో ఆధునిక వ్యాపారం
ఆధునిక డిజిటల్ యుగంలో పీఎం స్వనిధి పథకం వీధి వ్యాపారులను డిజిటల్ లావాదేవీల వైపు ప్రోత్సహిస్తోంది. యూపీఐ లాంటి చెల్లింపు పద్ధతులపై వారికి శిక్షణ ఇవ్వనున్నారు. దీనివల్ల కస్టమర్ల నుంచి నగదు రహిత చెల్లింపులు స్వీకరించడం సులభం అవుతుంది. ఈ డిజిటల్ లావాదేవీల వల్ల వారికి బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక లావాదేవీల చరిత్ర ఏర్పడుతుంది. ఇది భవిష్యత్‌లో మరింత ఎక్కువ రుణాలు పొందడానికి సహాయపడనుంది.
సమగ్ర ప్రయోజనాల వేదిక
లోక్ కల్యాణ్ మేళా అనేది పీఎం స్వనిధి లబ్ధిదారుల కోసం నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమం. ఈ మేళాలో కేవలం రుణాల మంజూరు మాత్రమే కాకుండా, వారి జీవితాలకు అవసరమైన అనేక ఇతర ప్రభుత్వ పథకాలను కూడా ఒకేచోట అందించనున్నారు. పీఎం సురక్షా బీమా యోజన పథకం ద్వారా వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నారు. పీఎం జీవన్ జ్యోతి యోజన పథకం ద్వారా జీవిత బీమా కవరేజ్ అందనుంది. శ్రమశక్తి పోర్టల్ అసంఘటిత రంగ కార్మికుల వివరాలు నమోదు చేసుకోవడానికి ఉపయోగపడనుంది. వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సులభంగా లభిస్తాయి.