పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కాగా, బుధవారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారి అలంకరణ విశిష్టతను వివరించారు.
చండీదేవిగా మారెమ్మతల్లి దర్శనం
ఖమ్మంరూరల్ : మండలంలోని రెడ్డిపల్లి శ్రీ మారెమ్మతల్లి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. కాగా. బుధవారం అమ్మవారు చండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో చండీహోమం, సాయంత్రం కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు కాశావజ్జుల రామశర్మ, అర్చకులు గండికోట నరేందర్ శర్మ, కాశావజ్జుల సతీష్ శర్మ, చక్రధర్ శర్మ, రాహుల్ శర్మ, శ్రీనివాస్ శర్మతో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
19 మండలాల్లో ఆదిసేవా కేంద్రాలు: ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 19 మండలాల్లోని 130 గ్రామాల్లో ఆది కర్మయోగి అభియాన్ పథకాన్ని ఈనెల 30 వరకు నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో ఆది సేవా కేంద్రాలు ప్రారంభిస్తున్నామని పీఓ బి. రాహుల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దుమ్ముగూడెం, ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, అశ్వాపురం, అశ్వారావుపేట, బూర్గంపాడు, దమ్మపేట, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, ములకలపల్లి, పాల్వంచ, పినపాక, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లెందు తదితర మండలాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. ఆది కర్మయోగి అభియాన్ రచ్చబండ కార్యక్రమాలకు నియమితులైన నోడల్ ఆఫీసర్లు, ప్రత్యేక అధికారులు డీఎంటీలు, బీఎంటీలతో పాటు ఆయా శాఖల అధికారులు సకాలంలో హాజరై ఆది సేవా కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. గ్రామాల్లో కాలినడకన ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకోవాలని, గ్రామసభ నిర్వహించి గ్రామస్తుల సమక్షంలో తీర్మానించి ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు.
కిన్నెరసానికి కొనసాగుతున్న వరద.. 5వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడుదల
పాల్వంచరూరల్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి 7వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో రిజర్వాయర్‌లో నీటిమట్టం బుధవారం నాటికి 405.80 అడుగులకు పెరిగింది. దీంతో ఒక గేటు ఎత్తివేసి 5వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు డ్యామ్‌సైడ్ పర్యవేక్షక ఇంజనీర్ తెలిపారు.
ముక్తార్ పాషా ఆశయాలు సాధించాలి
పాల్వంచ: కార్మిక ఉద్యమ నేత ముక్తార్ పాషా ఆశయాలు సాధించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి జిల్లా కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అన్నారు. బుధవారం స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో ముక్తార్ పాషా ఐదో వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నత చదువు చదివి, ఉన్నత కుటుంబంలో పుట్టి సమాజంలో కష్టాలు అనుభవిస్తున్న వారి కోసం ఉద్యమించారని కొనియాడారు. కార్యక్రమలో ఐఎఫ్‌టీయూ ఏరియా కార్యదర్శి మంకేన వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు ఎర్ణం శ్రీను, నాయకులు కె.నరసింహారావు, మల్లేష్, వీర, గోపి, రమేష్, సురేష్, భాస్కర్ పాల్గొన్నారు.

అన్నపూర్ణాదేవిగా పెద్దమ్మతల్లి