
కలవరపెడుతున్న ఆత్మహత్యలు
కొన్ని లక్షణాలతో గుర్తించొచ్చు...
● క్షణికావేశంతో గాలిలో దీపాల్లా ప్రాణాలు ● గత ఆరు నెలల్లో 400 మంది బలవన్మరణం ● ముందుగా గుర్తిస్తే అడ్డుకునే అవకాశం
●తండ్రి సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ పదో తరగతి విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
●ఇష్టం లేని సంబంధం చేస్తున్నారని భవిష్యత్ ఉన్న ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది.
●ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో ఇద్దరు చిన్నారులతో ఆనందంగా గడుపుతున్న భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న గొడవతో భార్య ఫ్యాన్‌కు ఉరివేసుకు ని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో అప్పటివరకు తల్లితో ఆడుకున్న చిన్నారులకు తట్టుకోలేకపోయారు.
●మూడు నెలల క్రితం ఖమ్మం రైల్వే స్టేషన్‌లో కీమెన్‌గా పనిచేస్తున్న ఉద్యోగిని భర్తతో గొడవపడి క్షణాకావేశంలో ఉరి వేసుకుంది. ఇది తెలిసి భర్త కూడా ఆమె ఉరి వేసుకున్న ఫ్యాన్‌కే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
●ఖమ్మం బ్యాంక్‌కాలనీలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో పట్టించుకోనే వారు లేక వృద్ధుడు భార్యను హతమార్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఖమ్మంక్రైం: జిల్లాలో కొంతకాలంగా చోటుచేసు కుంటున్న ఆత్మహత్యలు అందరినీ కలవర పెడుతున్నాయి. ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో కుటుంబ కలహాలతోపాటు, ఆర్థిక, ప్రేమ వ్యవహారం, వివిధ కారణాలతో క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. వీరిలో విద్యార్థులు, యువతే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది జిల్లాలో 1000 మంది బలవన్మరణానికి పాల్పడగా.. ఈ ఏడాది ఆరు నెలల్లో 400 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
మానసిక ఒత్తిడే ప్రధాన కారణం..
క్షణికావేశంతో ఆత్మహత్యలకు పాల్పడే ఎక్కువ మందిలో మానసిక ఒత్తిడే ప్రధాన కారణం. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోలేక, వినేవారులేక, తమ సమస్య చెప్పుకుంటే పరువు పోతుందేమోనని భావించి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీంతో క్షణికావేశంలోనే ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటారు.
ఆత్మహత్య చేసుకోవాలనే వారిని ముందుగానే గుర్తించవచ్చు. ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయడం, పదేపదే చనిపోతే బాగుండని అంటుండడం.. చిన్నచిన్న కారణాలకే కోపం తెచ్చుకుంటే వారిపై ఓ కన్నేయాలి. అలాగే, ఇష్టమైన వారికి పదేపదే వీడ్కోలు పలుకుతున్నా కుటుంబసభ్యులు, స్నేహితులు గమనించి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంతేకాక వారు ఒంటరి వాళ్లు కాదని భావన కలిగించాలి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన తగ్గిపోతుంది. అందమైన భవిష్యత్ కళ్ల ముందు ఉందని నమ్మకం కల్పించాలి. అయినా మార్పు రాకపోతే సైకాలిజిస్ట్‌ను సంప్రదించాలి.
– సౌమ్యాగ్రేస్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సైకియాట్రిస్ట్ విభాగం, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి

కలవరపెడుతున్న ఆత్మహత్యలు