
అందరి చూపూ.. ఫారెస్టు గ్రౌండ్ వైపు
ఇల్లెందు: ఇల్లెందులో దసరా ఉత్సవాలు అంటే మైసూర్‌ను తలదన్నెలా నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. ఈససారి ఇల్లెందులో కొంతమంది జేకే సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో మరికొంత మంది ఫారెస్టు గ్రౌండ్‌లో నిర్వహించాలని కోరుకుంటున్నారు. ఫారెస్టు గ్రౌండ్ కోర్టు పరిధిలోకి వెళ్లినందున జేకే సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌కు మార్చిన విషయం విధితమే. అయితే ఇటీవల రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లెందు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా ముడత వెంకట్‌గౌడ్ నేతృత్వంలో ప్రతినిధి బృందం ఓ వినతిపత్రం అందజేసింది. ఫారెస్టు గ్రౌండ్ కోర్టుకు అవసరం లేకపోతే మున్సిపాలిటీకి అప్పగించాలని మళ్లీ దసరా ఉత్సవాలు ఫారెస్టు గ్రౌండ్‌లో నిర్వహించుకునేలా చూడాలని వినతి పత్రంలో కోరారు. దీంతో నాటి నుంచి దసరా ఉత్సవాలు మళ్లీ ఫారెస్టు గ్రౌండ్‌లో జరుగుతాయని అంతా ఆశపడుతున్నారు. అయితే ఇంత వరకు ఉత్సవాలు ఏ గ్రౌండ్‌లో జరుగుతాయో తెలియని పరిస్థితి. దీనికి తోడు ఈసారి మున్సిపల్ పాలక వర్గం కూడా లేదు. ఏటా వినాయక ఉత్సవాలు, బతుకమ్మ, దసరా ఉత్సవాలు మున్సిపల్ పాలకవర్గం నిర్వహించటం అనవాయితీ. వినాయక ఉత్సవాలకు పట్టణంలో విగ్రహాలకు వీడ్కోలు పలికేందుకు ప్రధాన సెంటర్‌లో స్టేజీ నిర్మాణం చేసి దాని మీదుగా హారతీ ఇచ్చి వినాయక విగ్రహాలకు వీడ్కోలు పలకటం, స్టేజీ మీద అలరించేలా విభిన్న తరహాలో సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించటం జరుగుతుంది. ఇక బతుకమ్మ ఉత్సవాలు సైతం చెరువు కట్ట వద్ద స్టేజీ, లైటింగ్ ఏర్పాటు చేసి ఘాట్‌లో బతుకమ్మలను నిమజ్జనం చేయటం జరుగుతుంది. ఇక దసరా ఉత్సవాలకు గ్రౌండ్‌లో స్టేజీ నిర్మాణం చేసి సాంస్కృతిక కార్యక్రమాలు మిమిక్రీ, రావణవధ, షమీ పూజ, పాలపిట్ట దర్శనం, జమ్మిపూజ, దుర్గామాత విగ్రహాలకు వీడ్కోలు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే పట్టణంలోని ఫారెస్టు గ్రౌండ్‌కు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గ్రౌండ్ చుట్టూ బయటకు వెళ్లే మార్గాలు ఉండటం వల్ల ప్రశాంతంగా జరుగుతుందని, పట్టణానికి సెంటర్ పాయింట్‌లో ఉంటే అనువుగా ఉంటుందని అంతా ఫారెస్టు గ్రౌండ్‌లో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇక జేకే సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ ఒకటే ప్రధాన మార్గం ఉండటం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏటా సింగరేణి క్వార్టర్ల మధ్యలో రహదారులన్నీ వాహనాలతో నిండి స్థానికులకు ఇబ్బందిగా మారుతోందని అంటున్నారు. బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ముందు సభ నిర్వహించి అందరి అభిప్రాయం సేకరించటం, నిర్వహణ కోసం సమావేశం నిర్వహించటం జరుగుతుంది. ఈసారి ఇంత వరకు సమావేశాలు జరగలేదు. దీంతో భక్తుల్లో దసరా ఉత్సవాల మీద అయోమయం నెలకొంది

అందరి చూపూ.. ఫారెస్టు గ్రౌండ్ వైపు