
కుల వ్యవస్థ నిర్మూలనకు పాడుపడదాం..
సింగరేణి(కొత్తగూడెం): మహాత్మ జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజస్ఫూర్తితో కుల నిర్మూలనకు పాడుపడదామని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కెచ్చెల రంగారెడ్డి అన్నారు. బుధవారం కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. సత్యశోధక్ సమాజ్ ఏర్పడి 152 సంవత్సరాలు పూర్తియిందన్నారు. భారతదేశంలో సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని కొనియాడారు. బ్రాహ్మణాధిపత్య సమాజంలో దళితులను, వెనకబడిన వర్గాలను తీవ్రంగా అణచివేస్తున్న సమయంలో వాటికి వ్యతిరేకంగా పూలే పోరాడాలని తెలిపారు. సావిత్రీబాయి పూలేకి చదువు నేర్పి బాలికల కోసం భారతదేశంలో మొట్ట మొదటి పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని సావిత్రీబాయి పూలే బాలికలకు విద్యను అందించినట్లు చెప్పారు. భారతదేశంలో 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటీష్ సామ్రాజ్యవాదులు కూడా కుల నిర్మూలన కోసం పాడుపడకుండా వారి అవసరాల కోసం కులమతాలను ఉపయోగించుకున్నారని విమర్శించారు. భారతదేశంలో కులవ్యవస్థ సామాజిక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ సదస్సులో నాయకులు చండ్ర అరుణ, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, జిల్లా కార్యదర్శి, ముద్దా భిక్షం, పెద్దబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు.