
కొనుగోళ్లకు ప్లాన్
జిల్లాలో 326 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం
3,69,609 మెట్రిక్ టన్నుల
సేకరణ లక్ష్యం
కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు
చేస్తామంటున్న అధికారులు
అన్ని ఏర్పాట్లు చేస్తాం..
జిల్లాలో దొడ్డు, సన్న రకాలు (మెట్రిక్ టన్నుల్లో..)
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఈ వానాకాలంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని సేకరించేందుకు జిల్లా పౌర సరఫరాల సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. ధాన్యం మార్కెట్‌కు వచ్చినప్పుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఈ ఏడాది 1,18,040 హెక్టార్లలో వరి పంట సాగైంది. మొత్తం దిగుబడిలో 3,69,609 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించింది. ప్రభుత్వం సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్న నేపథ్యంలో దొడ్డు, సన్న ధాన్యాలను వేర్వేరుగా సేకరించనున్నారు. ఇందుకోసం 326 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే గన్నీ బ్యాగ్‌లు, ఇతర ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
సన్న ధాన్యమే ఎక్కువ..
జిల్లాలో మొత్తం 1,18,040 హెక్టార్లలో 7,23,988 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ఆ శాఖ అంచనా వేసింది. ఇందులో 51,971 మెట్రిక్ టన్నులు స్థానిక అవసరాలు, విత్తనాల కోసం వినియోగిస్తారని, మార్కెట్‌కు 6,72,017 మెట్రిక్ టన్నులు విక్రయానికి వస్తే వ్యాపారులు, మిల్లర్లు 3,02,408 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తారని భావిస్తోంది. ఇక మిగిలిన 3,69,609 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని పౌర సరఫరాల సంస్థ నిర్ణయించింది. ఈ మొత్తంలో 18,480 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం, 3,51,129 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం ఉండనుంది.
ఽఈ కేంద్రాల్లో సేకరణ..
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వ్యవసాయ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ధాన్యం ఎక్కువగా దిగుబడి వచ్చిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఆన్‌లైన్ ఎంట్రీ కోసం కంప్యూటర్లు, ట్యాబ్‌లతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం గల వారిని నియమించనున్నారు. మొత్తం 326 కేంద్రాలకు గాను 51 కేంద్రాల్లో దొడ్డు రకం, 275 కేంద్రాల్లో సన్న రకం ధాన్యం సేకరిస్తారు. డీసీఎంఎస్, డీఆర్‌డీఏ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో ఈ కేంద్రాల నిర్వహణ సాగనుంది. కొనుగోలు కేంద్రాలకు వాటి పరిధిలోని గ్రామాలను టాగ్ చేయడంతో పాటు ఆయా కేంద్రాల్లోనే కొనుగోలు చేస్తామంటూ రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
నవంబర్ రెండో వారంలో..
నవంబర్ రెండో వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. నవంబర్ నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు కొనుగోళ్లు ఉంటాయి. పౌరసరఫరాల సంస్థ ద్వారా నవంబర్‌లో 55,441 మెట్రిక్ టన్నులు, డిసెంబర్‌లో 2,40,246 మెట్రిక్ టన్నులు, జనవరిలో 73,922 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు నిర్వాహకులకు శిక్షణ ఇవ్వనున్నారు. కాగా, నిర్వాహకులే హమాలీలను నియమించుకోవాల్సి ఉంటుంది.
అన్నీ అందుబాటులో ఉండేలా..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తంగా 92,40,225 గన్నీ బ్యాగులు అవసరమని భావిస్తుండగా.. అందులో కొత్తవి 49,89,722, వాడేసినవి, పాతవి 42,50,504 ఉండాలి. ప్రస్తుతం గోడౌన్‌లో 33,51,977 బ్యాగులు ఉండగా.. మిల్లర్ల నుంచి తీసుకున్న పాత గన్నీలు 10లక్షలు ఉన్నాయి. మొత్తం 43,51,977 గన్నీలు ఉండగా.. ఇంకా 48,88,248 అవసరం ఉన్నాయి.
టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లు, మాయిశ్చర్ మీటర్లు, వేయింగ్ మిషన్లు, పొట్టు తొలగించే పరికరాలు, ఫీల్డ్ బ్యాలెన్స్, జల్లెడలు, ఫ్యాన్‌లు, లిఫ్టర్లు తదితర పరికరాలు అవసరం ఉండగా.. కొన్ని అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇతర సదుపాయాలు కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో వరిసాగు వివరాలిలా(హెక్టార్లలో)
మొత్తం పంట సాగు 1,18,040
దొడ్డు రకం 5,989
సన్నరకం 1,12,051
వానాకాలం ధాన్యం
సేకరణకు కసరత్తు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. కొనుగోళ్లకు కావాల్సిన గన్నీలు, టార్పాలిన్లు, వేయింగ్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచుతాం. ఈ వానాకాలం సన్న, దొడ్డు రకం ధాన్యం ఎంత కొనుగోలు చేయాలన్నది ఖరారు చేశాం. ఈ మేరకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయిస్తున్నాం.
– శ్రీలత, పౌర సరఫరాల సంస్థ మేనేజర్
అంశం దొడ్డురకం సన్నరకం మొత్తం
ధాన్యం దిగుబడి 39,272 6,84,716 7,23,988 (అంచనా)
స్థానిక అవసరాలు, విత్తనాలకు 0 51,971 51,971
మార్కెట్‌కు వచ్చే ధాన్యం 39,272 6,32,745 6,72,017
మిల్లర్లు, వ్యాపారులు సేకరించేది 20,792 2,81,616 3,02,408
కొనుగోలు కేంద్రాల్లో సేకరించేది 18,480 3,51,129 3,69,609

కొనుగోళ్లకు ప్లాన్

కొనుగోళ్లకు ప్లాన్