రైతును రాజు చేయడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతును రాజు చేయడమే లక్ష్యం

Sep 25 2025 7:27 AM | Updated on Sep 25 2025 7:27 AM

రైతున

రైతును రాజు చేయడమే లక్ష్యం

పేదల గృహప్రవేశంతో నాజన్మ ధన్యం

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క ఇల్లూ ఇవ్వలేదు

రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి

ఖమ్మంరూరల్‌ : రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని ఎం.వెంకటాయపాలెంలో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 9,700 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల శీతల గోదాం పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆరెంపులలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఆ తర్వాత సీసీ రోడ్డు పనులకు, పశుసంవర్థక శాఖ ఉప కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో పొంగులేటి మాట్లాడుతూ.. గత పదేళ్లలో గిడ్డంగుల సామర్థ్యాన్ని 3 లక్షల టన్నులకు పెంచితే, తమ ప్రభుత్వంలో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం మేరకు గోడౌన్లు నిర్మిస్తున్నామని, రాబోయే మూడేళ్లలో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎం.వి.పాలెంలో కోల్డ్‌ స్టోరేజ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఏడాదిలో పనులు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. వానాకాలంలో సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌ ఇచ్చామని, రబీ బోనస్‌ త్వరలో జమ చేయనున్నట్లు తెలిపారు.

పేదల ఆత్మ గౌరవానికి చిహ్నం..

పేదల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. ఆరెంపులలో నిర్మించిన ఇళ్లను ప్రారంభించాక ఆయన మాట్లాడారు. గత పాలకులు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో మోసం చేస్తే తమ ప్రభుత్వం మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని, అర్హులందరికీ మరో మూడు విడతల్లో కేటాయిస్తామని తెలిపారు. పేద ప్రజల ఆత్మగౌరవం కోసమే ఇళ్లు నిర్మిస్తున్నామని, వారితో గృహప్రవేశం చేయించడంతో తన జన్మ ధన్యమైందని పేర్కొన్నారు. ఇళ్లు నిర్మించుకునే పేదలు ఇబ్బంది పడకుండా ప్రతీ సోమవారం డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్పారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో సీఎం చేతుల మీదుగా తొలిసారి ఇళ్ల ప్రారంభోత్సవం జరగగా, రెండోసారి ఆరెంపులలో చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో మొదటి విడతలో 16,300 ఇళ్లు మంజూరు కాగా 14 వేల ఇళ్లకు పైగా మార్కింగ్‌ చేశామని, పది వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.142 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్‌, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, ఎండీ కొర్రా లక్ష్మి, ఐడీసీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, మద్దులపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భైరు హరినాథబాబు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌ నాయకులు బండి జగదీష్‌, చింతమళ్ల రవికుమార్‌, మద్ది మల్లారెడ్డి, ధరావత్‌ రామ్మూర్తినాయక్‌, కన్నేటి నర్శింహారావు, బొర్రా రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతును రాజు చేయడమే లక్ష్యం1
1/1

రైతును రాజు చేయడమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement