
కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు
● జమలాపురంలో శ్రీ గాయత్రీదేవిగా అమ్మవారు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీవేంకేటేశ్వరస్వామి వారి ఆలయంలో మూడో రోజు బుధవారం శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. శ్రీవారికి ఆలయ అర్చకులు పంచామృతాభిషేకం చేశారు. శ్రీ అలివేలు మంగ అమ్మవారు శ్రీగాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా, గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆ తర్వాత భక్తులకు అన్నదానం, గోమాతకు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ పాల్గొన్నారు.
జిల్లాలో నేడు
పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్ : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉద యం 10.45 గంటలకు కల్లూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కూసుమంచిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. 3.30 గంటలకు మండలంలోని భగత్‌వీడులో, 4 గంటలకు మంగలితండాలో, 4.30 గంటలకు ఈశ్వరమాధారంలో, 5 గంటలకు రాజుపేట బజార్‌లో, 5.30 గంటలకు పెరికసింగారంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పెరికసింగారం గ్రామంలో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో మంత్రి పొంగులేటి పాల్గొంటారు.
విదేశీ విద్యా పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్ : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ విద్యార్థుల నుంచి అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం కింద అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు జి.జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు. ఆసక్తి గల విద్యార్థులు నవంబర్ 19 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించరాదని, ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈ, జీఎంఏటీ, పీటీఈలలో ఏదో ఒక పరీక్షలో అర్హత సాధించి ఉండాలని, తప్పనిసరిగా పాస్ పోర్ట్ కలిగి ఉండాలని, గుర్తింపు పొందిన విదేశీ యూనివర్సిటీలో ప్రవేశం పొంది ఉండాలని వివరించారు.
అన్నం శ్రీనివాసరావుకు అవార్డు
ఖమ్మం అర్బన్ : హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన అచీవ్‌మెంట్ అవార్డు–2025 కార్యక్రమంలో జిల్లాకు చెందిన అన్నం సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నం శ్రీని వాసరావుకు పురస్కారం దక్కింది. ఈ మేరకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పోతుగంటి వెంకటేశ్వర్లు, గంధం పట్టాభి రామారావు, షేక్ నాగుల్‌మీరా, కేశవపట్నం శ్రీనివాస్, కడవెండి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు