
ఆరోగ్య కేంద్రాల తనిఖీ
ఖమ్మంవైద్యవిభాగం : నగరంలోని పలు ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్‌ఓ డాక్టర్ కళావతిబాయి బుధవారం తనిఖీ చేశారు. ముస్తఫానగర్ యూపీహెచ్‌సీ పరిధిలోని బస్తీ దవాఖానలో పేషెంట్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓపీ, రికార్డులు, ల్యాబ్, ఫార్మసీ, ఇతర రిజిస్టర్లను, ఆరోగ్య కేంద్రం సేవలను, సిబ్బంది పనితీరును పరిశీలించారు. పేషెంట్లతో మర్యాదగా ప్రవర్తించాలని, డ్యూటీ సమయంలో సెల్ ఫోన్ వాడకం తగ్గించాలని సిబ్బందిని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, డెంగీపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పాత మున్సిపాలిటీలోని హెల్త్ సెంటర్‌ను సందర్శిచారు. సిబ్బందితో మాట్లాడి, ప్రజలకు అందిస్తున్న సేవలను గమనించారు. నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని, ప్రజలకు అవసరమైన సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఆ తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలలో హెపటైటిస్ – బీ టీకా కార్యక్రమాన్ని డీఎంహెచ్‌ఓ ప్రారంభించారు. హెపటైటిస్–బీ అనేది కాలేయాన్ని ప్రభావితం చేసే ప్రమాదకరమైన వ్యాధి అని, రక్తం, శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం కారణంగా హెల్త్ కేర్ వర్కర్లు ఈ వ్యాధికి ఎక్కువగా లోనవుతారని తెలిపారు. ఈ వ్యాధి నుంచి రక్షణ పొందడానికి టీకా అత్యంత సురక్షితమైన, ప్రభావవంతమైన మార్గమని తెలిపారు. కాలేజీ సిబ్బందికి డీఎంహెచ్‌ఓ స్వయంగా హెపటైటిస్–బి టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి.శంకర్, అదనపు డీఎంహెచ్‌ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.