
వైద్య కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
ఖమ్మంవైద్యవిభాగం : ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2025 – 26 యేడాదికి గాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు ఖమ్మం కళాశాలలో చేరేందుకు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే 78 మంది విద్యార్థులు కళాశాలలో ప్రవేశాలు పొందడం గమనార్హం. అందులో జాతీయ కోటాలో 15 సీట్లు భర్తీ కాగా, మిగతా 85 సీట్లలో ఇప్పటికే 63 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. అందులో జిల్లాకు చెందిన విద్యార్థులే 40 మంది ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. ముఖ్యంగా కళాశాలలో సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు సరిపడా బోధన సిబ్బంది అందుబాటులో ఉండడంతో ఖమ్మం కళాశాలను ఆప్షన్ పెట్టుకునేందుకు మొగ్గుచూపిస్తున్నారని చెప్పారు. కాగా ఈనెల 29 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. మిగతా 22 సీట్లు కూడా రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యే అవకాశం ఉంది. అయితే మొదటి సంవత్సర విద్యార్థులకు అక్టోబర్ రెండో వారంలో తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.