
పకడ్బందీగా సదరమ్ శిబిరాలు
ఖమ్మంవైద్యవిభాగం: యూడీఐడీ కార్డు(సదరమ్)ల జారీ కోసం నిర్వహిస్తున్న శిబిరాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షిస్తున్నామని ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ తెలిపారు. ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన శిబిరాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు ఇబ్బంది ఎదురుకాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కాగా, అన్ని పరీక్షల అనంతరం అర్హులకు సర్టిఫికెట్లు జారీ చేయనున్నందున ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కొందరు అర్హత లేకపోయినా సర్టిఫికెట్ ఇప్పిస్తామని చెబుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారి సమాచారం తమకు ఇవ్వాలని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 2వేల మంది వరకు స్లాట్ బుక్ చేసుకున్నందున షెడ్యూల్ ప్రకారం విడతల వారీగా క్యాంపులు నిర్వహిస్తామని సూపరింటెండెండ్ చెప్పారు. కాగా, సదరమ్ విభాగంలో కొందరు ఉద్యోగులపై ఆరోపణలు రావడంతో వారి స్థానంలో ఇతరులను నియమించామని, కార్యాలయాన్ని కూడా క్యాంపు నిర్వహించే ప్రాంతానికి మార్చినట్లు తెలిపారు.
సదరమ్ విభాగంలో విచారణ
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని సదరమ్ విభాగంలో జిల్లా మహిళా ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేత మంగళవారం విచారణ చేపట్టారు. ఈ విభాగంలోని ఓ ఉద్యోగి నకిలీ దివ్యాంగుల సర్టిఫికెట్‌తో డీఈఓగా విధులు నిర్వహిస్తున్నట్లు దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విజేత విచారణ చేపట్టి ఉద్యోగుల వివరాలు సేకరించారు.
ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్
నరేందర్