
క్రీడా స్ఫూర్తికి నిలువుటద్దం స్వామి రమేష్
ఖమ్మం స్పోర్ట్స్: ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన అంతర్జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు 24 పతకాలు సాధించడంలో కీలకంగా నిలిచిన స్వామి రమేష్ క్రీడా స్పూర్తికి నిలువుటద్దంలా నిలిచారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కొనియాడారు. భారత బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, ఖమ్మంకు చెందిన న్యాయవాది స్వామి రమేష్‌ను మంగళవారం సాయంత్రం బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘురాంరెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ అభివృద్ధికి రమేష్ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే దేశ క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించేలా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మల్లాది వాసుదేవరావు, వడ్డెల్లి కృష్ణమూర్తి, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి తదితరులతో పాటు క్రీడా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.