
టేకులపల్లి వంతెన వద్ద రక్షణ గోడ
ప్రధాన రోడ్డులో ప్రమాదాల నివారణకు ప్రతిపాదన
ఖమ్మం అర్బన్: జిల్లా కేంద్రంలో సాగర్ ప్రధాన కాల్వపై టేకులపల్లి వద్ద వంతెన ఉండగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రమాదాల నివారణకు అక్కడ రక్షణ గోడ నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఖమ్మం–వైరా బైపాస్‌లో కాల్వకు ఆనుకుని ప్రధాన రహదారి ఉండటంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అలాగే, ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు సమీపాన కాల్వలోకి కారు దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. జిల్లాలోని ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా.. టేకులపల్లి వంతెన వద్ద ప్రమాదాలను అరికట్టేందుకు రక్షణ గోడ నిర్మించాలని నిర్ణయించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో జల వనరుల శాఖ అధికారులు సుమారు 500 మీటర్ల పొడవైన రక్షణ గోడ నిర్మాణంతో పాటు లక్ష్మీనగర్ వాసుల కోసం బతుకమ్మ ఘాట్ పేరిట మెట్లు కూడా నిర్మించనున్నారు. ఇందుకోసం సుమారు రూ.5 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది.