
కలెక్టర్‌ను కలిసిన అడిషనల్ డీసీపీ
ఖమ్మంక్రైం: ఖమ్మం అడిషనల్ డీసీపీ(అడ్మిన్)గా బి.రామానుజం ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన కలెక్టర్ అనుదీప్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
పెద్దాస్పత్రిలో వైద్యులు, ఉద్యోగుల నిరసన
ఖమ్మంవైద్యవిభాగం: చికిత్సలో లోపం ఉందంటూ మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై కొందరు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆస్పత్రి ఎదుట నిరసన తెలపగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ మాట్లాడుతూ చికిత్స కోసం వచ్చే ప్రాణాలు కాపాడేందుకు శ్రమించే వైద్యులపై దాడులు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ టీచింగ్ డాక్టర్స్ అసోసియేషన్, నర్సింగ్ అసోసియేషన్ల బాధ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
స్కూల్ గేమ్స్
కార్యాచరణ ఖరారు
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన పోటీల నిర్వహణకు కార్యాచరణ ఖరారైందనిపాఠశాలల క్రీడా కార్యదర్శి పూనా టి వెంకటేశ్వర్లు తెలిపారు. అండర్–14, 17 విభాగాల్లో మండల, జోన్, జిల్లా స్థాయి పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. మండల స్థాయి పోటీలను అక్టోబర్ 10వ తేదీలోగా పూర్తిచేసి ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారని తెలిపారు. ఆతర్వాత ఉమ్మడి జిల్లా స్థాయిపోటీలు నిర్వహించాక రాష్ట్రస్థాయి పోటీ ల్లో పాల్గొనే జట్టును ఎంపిక చేయనుననట్లు వెల్లడించారు. కాగా, జిల్లాస్థాయిలో ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, నెట్‌బాల్ పోటీలు పోటీలు జరుగుతాయని తెలిపారు.
వీడియో కెమెరామెన్
నియామకానికి దరఖాస్తులు
ఖమ్మం సహకారనగర్: జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో పబ్లిసిటీ అసిస్టెంట్(వీడియో కెమెరామెన్)గా ఔట్ సోర్సింగ్ ప్రాతి పదికపై పనిచేసేందుకు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి సూచించారు. డిగ్రీ అర్హతతో పాటు ఏపీ / తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా జారీ చేసిన సినీ ఫొటోగ్రఫీ సర్టిఫికెట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాలతో ఈనెల 25వ తేదీ లోగా డీపీఆర్‌ఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు.
69 పీఏసీఎస్‌ల
పాలకవర్గాలు
కొనసాగింపు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని 76 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా(పీఏసీఎస్)లకు గాను 69 పీఏసీఎస్‌ల పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగిస్తూ జిల్లా సహకార అధికారి జి.గంగాధర్ ఉత్తర్వులు జారీ చేశారు. కుర్నవల్లి పాలకవర్గాన్ని గతంలోనే రద్దు చేయగా, మిగతా ఆరు సంఘాల పాలకవర్గాలను తాజాగా రద్దు చేసి ఆ స్థానంలో పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమించారు. దశల వారీగా జరిగిన ఈ ప్రక్రియ మంగళవారంతో పూర్తయిందని అధికారులు వెల్లడించారు. అయితే, రద్దయిన ఏదులాపురం, నేలకొండపల్లి, చేగొమ్మ, తల్లాడ, కల్లూరు, పోచారం సంఘాల బాధ్యులు హైకోర్టును ఆశ్రయించారు. వీరికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చిందనే ప్రచారం జరుగుతున్నా జిల్లా సహకార శాఖ అధికారులు మాత్రం మంగళవారం వరకు ఉత్తర్వులు అందలేదని సమాచారం.

కలెక్టర్‌ను కలిసిన అడిషనల్ డీసీపీ