
శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
ఎర్రుపాలెం: జమలాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా శ్రీవారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించాక ఆలయ పుష్కరిణి నుంచి సాయంత్రం తీర్థపు బిందెను తోడ్కోని వచ్చారు. అనంతరం యాగశాలలో స్వామి, అమ్మవార్లకు ఆలయ చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ఈఓ జగన్మోహన్‌రావు, దాతలు తుళ్లూరు కోటేశ్వరరావు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించాక ఉత్సవాలు ప్రారంభించారు. ప్రత్యేక పూజలు చేశాక అమ్మవార్లను చందనంతో అలంకరించగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కాగా, శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మంగళవారం బాలాత్రిపుర సుందరీదేవి రూపంలో అలంకరించనున్నారు. ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు, సిబ్బంది, నాయకులు తల్లపురెడ్డి వెంకట్రామిరెడ్డి, నన్నపనేని రామారావు, వేజండ్ల సాయికుమార్, మున్నలూరి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.