
టీటీడీ కల్యాణ మండపం పునఃప్రారంభం
కల్లూరు: కల్లూరులో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యాన 1995లో నిర్మించిన కల్యాణ మండపం కొన్నాళ్ల క్రితం మూతపడింది. స్థాని కులకు ఉపయోగంగా ఉన్న ఈ మండపం మూతపడగా ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లలో కార్యక్రమాల నిర్వహణకు ఆర్థిక భారం పడుతోంది. దీంతో టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో కల్యాణ మండపాన్ని పునఃప్రారంభించేందుకు అంగీకరించారు. దీంతో మండపాన్ని మార్కెట్ చైర్‌పర్సన్ బాగం నీరజ, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఈమేరకు స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్వాహకులు ఎనుముల రాము, ఎనుముల రుక్మిణీ యాదవ్‌తో పాటు నాయకులు పసుమర్తి చందర్‌రావు, లక్కినేని కృష్ణ, పెద్దబోయిన శ్రీను, ఏనుగు సత్యంబాబు, తల్లపురెడ్డి హన్విరెడ్డి, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, నోటికృష్ణా రెడ్డి, జిల్లెళ్ల కృష్ణారెడ్డి, తండు రాములు, పుల్లాచారి పాల్గొన్నారు.
వర్షం, గాలిదుమారంతో పంటలకు నష్టం
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి గాలిదుమారంతో పాటు భారీ వర్షం కురిసింది. దీంతో పత్తి, మిర్చి పంటలు నేలవాలాయి. పూత, కాత దశలో ఉన్న పత్తికి ఈ వర్షంతో నష్టం ఎదురైంది. ఈమేరకు దమ్మాయిగూడెం, తెట్టెలపాడు, ఎదుళ్లచెరువు, పిండిప్రోలు, గోల్‌తండా, జింకలగూడెం తదితర గ్రామాల్లో పత్తి చేన్లను మండల వ్యవసాయాధికారి నారెడ్డి సీతారాంరెడ్డి పరిశీలించారు. పంటల నష్టంపై జిల్లా అధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు.
లఢాక్ మారథాన్‌లో కానిస్టేబుల్ ప్రతిభ
ఖమ్మంక్రైం: ప్రపంచంలోనే ఎత్తయిన లఢాక్ వద్ద నిర్వహించిన మారథాన్‌లో ప్రతిభ చాటిన ఏఆర్ కానిస్టేబుల్ పిల్లి రాజును పోలీసు కమిషనర్ సునీల్‌దత్ సోమవారం అభినందించారు. ఈనెల 14వ తేదీన నిర్వహించిన మారథాన్‌ను 5–36గంటల్లో పూర్తిచేసి రికార్డు సాధించారని తెలిపారు. ఖమ్మం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న రాజు గతంలోనూ పలు మారథాన్లలో పతకాలు సాధించారు. ఈ సందర్భంగా తనను ప్రోత్సహిస్తున్న తెలంగాణ స్పోర్ట్స్ అధికారి రమేష్, సీపీ సునీల్‌దత్, డీసీపీ కుమారస్వామి, ఆర్‌ఐ కామరాజు, ఎంటీఓ శ్రీశైలంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మండపాల్లో
జాగ్రత్తలు తప్పనిసరి
ఖమ్మంక్రైం: దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మండపాలు ఏర్పాటుచేసిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అడిషనల్ డీసీపీ(లా అండ్ ఆర్డర్) ప్రసాద్‌రావు సూచించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వేడుకలు జరిగే చోట్ల అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేయాలని తెలిపారు. అలాగే, భద్రతా చర్యలు పాటించేలా నిర్వాహకులకు సూచనలు చేయాలన్నారు. అన్ని మండలాలను జియోట్యాగ్ చేయాలని సూచించారు. అంతేకాక మహిళలు బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.

టీటీడీ కల్యాణ మండపం పునఃప్రారంభం

టీటీడీ కల్యాణ మండపం పునఃప్రారంభం

టీటీడీ కల్యాణ మండపం పునఃప్రారంభం