
కోక లేకుండానే పండుగా ?!
గోదాంల వారీగా జిల్లాకు కేటాయించిన చీరలు
● ఎస్‌హెచ్‌జీల సభ్యులకు అందని ‘రేవంతన్న కానుక’ ● జిల్లాకు 3,35,879 చీరలు కేటాయింపు ● 1,80,779 చీరలే చేరడంతో పంపిణీపై సందిగ్ధత
ఖమ్మంమయూరిసెంటర్: ‘అక్కాచెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరుతో స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బతుకమ్మ పండుగ నాటికి సభ్యులకు రెండేసి చీరలు ఇస్తామని ప్రకటించారు. అయితే, బతుకమ్మ పండుగ రెండు రోజులు గడిచినా జిల్లాకు పూర్తి స్థాయిలో చీరలే చేరకపోగా.. పంపిణీపై యంత్రాంగం అయోమయంలో పడిపోయింది. కనీసం ఒక్కో చీర ఇవ్వాలని భావించినా ఆ స్థాయిలో స్టాక్ రాకపోవడం.. కొందరికే ఇస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియక పెండింగ్ పెట్టినట్లు తెలుస్తోంది.
స్టాక్ పాయింట్లకు 1.80 లక్షల చీరలు
మహిళా సంఘాల సభ్యులకు అందించే చీరలను జిల్లాలకు సరఫరా చేసింది. జిల్లాలో 3,35,879 మంది సభ్యులకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయింయగా.. సెర్ప్, మెప్మా పరిధిలోని సంఘాల సభ్యులను గుర్తించారు. ఒక్కో సభ్యురాలికి రెండేసి చీరలు పంపిణీ చేసేందుకు మొత్తం 6,71,758 చీరలు అవసరమవుతాయి. మొదటి విడతలో 3,35,879 చీరలు సరఫరా చేస్తామని ప్రకటించినా అందులో 1,80,779 చీరలే వచ్చా యి. దీంతో చీరలను సెర్ప్ అధికారులు గోదాంల్లో భద్రపరిచారు. ఇక మెప్మాకు సంబంధించి సంఘాల్లోని సభ్యులకు సరఫరా చేసేందుకు ఒక్క చీర కూడా జిల్లాకు చేరలేదు.
ఒక చీర ఇవ్వాలన్నా..
గతేడాది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించినట్లుగా ఈ ఏడాది బతుకమ్మ పండుగ నాటికి మహిళ సభ్యులకు చీరలు అందుతాయని అంతా భావించారు. ఈనెల 5వ తేదీ నుంచే ప్రభుత్వం జిల్లాలకు చీరల సరఫరాను ప్రారంభించింది. ఈ నెల 9వ తేదీ నాటికి 1.80 లక్షల చీరలే రాగా.. మిగిలిన చీరలు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. బతుకమ్మ వేడుకల మొదటి రోజే ఒక్కో చీర అయినా పంపిణీ చేస్తారని భావించినా అలా జరగలేదు. జిల్లాలోని సభ్యులకు ఒక్కో చీర పంపిణీ చేయాలన్నా ఇంకా 1,55,100 చీరలు అవసరం కావడం.. అవి ఎప్పుడు వస్తాయో తెలియక అధికారులు ఉన్నత స్థాయి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.
గోడౌన్ కేటాయించిన చీరలు చేరినవి
జిల్లా సమాఖ్య, టేకులపల్లి 1,50,084 98,640
వైరా ఏఎంసీ 52,399 26,200
మధిర ఏఎంసీ 34,254 17,127
సత్తుపల్లి ఎంఎస్ ఆఫీసు 38,812 38,812
మెప్మా 60,330 000
మొత్తం 3,35,879 1,80,779