
దందాకు ఆ భూములే దన్ను
నేడు రెవెన్యూ, మైనింగ్ అధికారుల సర్వే
● ఇదీ.. గంగాపురం మున్నేరు లంక భూముల కథ ● అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు ● పంట లేకున్నా రైతుభరోసా.. ఆపై ఇసుక దందా ● అధికారులు సర్వే చేస్తేనే బయట పడనున్న బండారం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ముదిగొండ మండలం గంగాపురం రెవెన్యూ పరిధిలో మున్నేటి లంక భూములు ఇసుక దందాకు దన్నుగా నిలుస్తున్నాయి. చింతకాని మండలం చిన్నమండవ వైపు ఉన్న ఈ భూముల్లో ఏళ్లుగా దందా సాగుతున్నా అధికారులెవరూ కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న కొందరు భూముల మాటున మున్నేటిని చెరబట్టిన విషయం ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాక భూమిపై సదరు వ్యక్తులు రైతు భరోసా పొందుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయిలో విచారిస్తే ఎంత మేర మున్నేటి లంకభూమి ఆక్రమణకు గురైంది, హక్కుదారులు ఎవరు, ఆక్రమణదారులు ఎవరో తేలనుంది. ఈ అంశంపై విచారణకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరిని ప్రత్యేక అధికారిగా కలెక్టర్ అనుదీప్ నియమించారు.
అటు లంక.. ఇటు వక్ఫ్ భూమి
గంగాపురం రెవెన్యూ పరిధిలో చిన్నమండవ మున్నేటి వైపు 67.28 ఎకరాల లంక భూమి ఉంది. ఈ భూమిని వివిధ ప్రాంతాల వ్యక్తులు కొనుగోలు చేసి పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందారు. సాగుకు యోగ్యం కాని ఈ లంక భూమిలో ఇసుక వ్యాపారం చేయడం కోసమే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 150 ఎకరాల మేర మున్నేటి ప్రాంతంలోకి వెళ్లి ఇసుక దందా కొనసాగిస్తున్నారు. ఇక్కడ వక్ఫ్ భూమి కూడా 15 ఎకరాలనూ కలుపుకున్నారనే ఆరోపణలున్నాయి. 122వ సర్వేనంబర్ నుంచి 126వ సర్వే నంబర్ వరకు 67.28 ఎకరాలు ఉండగా.. బై నంబర్లతో ఆక్రమించుకున్న భూమికి పట్టా దారు పాస్ పుస్తకాలు దక్కించుకోవడం గమనార్హం.
ఫోర్జరీ సంతకాలతో..
చిన్నమండవ రెవెన్యూ వైపు ఉన్న లంక భూములకు సంబంధించి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనతో పాటు ఆయన కొడుకు పేరిట 2018లో పాస్ పుస్తకాలు పొందాడు. అయితే, గంగాపురం రెవెన్యూ పరిధి లంక భూములపై అంతకుముందే పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. ఫోర్జరీ సంతకాలతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి పట్టదారు పాస్ పుస్తకాలు పొందినట్లు గుర్తించి 2019లో వాటిని రద్దు చేశారు.
ఈ భూములకు ఎలా?
ఎనిమిది ఎకరాలకు ఓ వ్యక్తి పొందిన పాస్ పుస్తకాలను రద్దు చేసిన అధికారులు.. దాదాపు 150 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకుని పట్టాదారు పుస్తకాలు పొందిన వారిపై మాత్రం చర్యలు తీసుకోలేదు. 123 నుంచి 126వ సర్వేనంబర్ వరకు అంతకుముందే పాస్‌పుస్తకాలు పొందిన వారి పత్రాలను ఎందుకు పరిశీలించలేదు, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నలకే కాక ఇన్ని ఎకరాల భూమిలో దందా సాగిస్తుంటే ఏం చేశారన్న ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. గంగాపురం గ్రామం పూర్తిగా కనుమరుగైనప్పుడు ఆ రెవెన్యూ పరిధిలో సాగుకు యోగ్యం కాని భూములను రిజిస్ట్రేషన్లు చేయకూడదనే నిబంధన ఉన్నా కొందరు అధికారుల అండదండలతో అక్రమార్కులు పాస్ పుస్తకాలు పొంది ఇసుక దందా చేస్తూ రూ.కోట్లలో ఆర్జిస్తున్నారు. ఇది కాక సాగుకు యోగ్యం కాని ఈ భూమిలో గత ప్రభుత్వంతోపాటు ప్రస్తుత ప్రభుత్వం నుంచి కూడా రైతుభరోసా పొందుతున్నారు. ఈ భూములపై అధికారులపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టి పాస్ పుస్తకాలను రద్దు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తోంది.
మున్నేటి లంక భూముల్లో ఏళ్లుగా సాగుతున్న ఇసుక దందాపై డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో పాటు జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతో మూడు రోజుల క్రితం ఎస్‌డీసీ రాజేశ్వరి లంక భూములను పరిశీలించారు. మున్నేటిలో నిర్మించిన రహదారి తొలగించగా.. సర్వే చేయాలని సూచించారు. ఈమేరకు సోమవారమే రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు సర్వే చేయాల్సి ఉన్నా డిప్యూటీ సీఎం ముదిగొండ పర్యటన నేపథ్యాన మంగళవారానికి వాయిదా పడింది.