
ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ముదిగొండ మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ముదిగొండ: రాష్ట్రంలోని ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ముదిగొండ మండలం యడవల్లి, యడవల్లి లక్ష్మీపురంలో జీపీ భవనాలు, యడవల్లి, మాదాపురం, ముదిగొండ ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, అంగన్‌వాడీ భవనం నిర్మాణాలకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి సోమవారం సాయంత్రం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ మధిర నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ అమలుచేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని తెలిపారు. ఈమేరకు అభివృద్ధి పనులు నాణ్యతగా, త్వరగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. కాగా, తాము అధికా రంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం, పేదలకు రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, కొత్త కార్డుల మంజూరుతో పాటు రైతుల రుణమాఫీ, రైతు భరోసా, సన్న ధాన్యానికి బోనస్ తదితర పథకాలు అమలుచేస్తున్నామని తెలిపారు. అంతేకాక అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను ప్రతీ నియోజకవర్గంలో నిర్మించనున్నట్లు భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్ అండ్ బీ, పీఆర్ ఎస్‌ఈలు యాకోబు, వెంకట్‌రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
అప్పుల ఊబి నుంచి బయటపడేలా..
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వాన మంత్రి వర్గంలో చేస్తున్న కృషిని గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని డిప్యూటీ సీఎంభట్టి తెలిపారు. ముదిగొండలో ఏర్పాటుచేసిన సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు పలువురు కాంగ్రెస్‌లో చేరగా భట్టి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించాక మాట్లాడారు. తమ ప్రభుత్వం ప్రజల అభ్యున్నతికే కాదు రాష్ట్ర ప్రగతికి వేస్తున్న పునాదులను చూసి కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణను ఇస్తే గత పాలకులు రూ.లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని ఆరోపించారు. అంతేకాక ఆర్థికంగా, పాలనాపరంగా వ్యవస్థలను విధ్వంసం చేశారని పేర్కొన్నారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోగా, మాజీ సీఎం వైఎస్. రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టును మూలన పడేశారని ఆరోపించారు. గత పాలకుల తీరుతో నెలకు రూ.11 వేల కోట్లు వడ్డీ కడుతుండగా, అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇదేసమయాన సంక్షేమ పథకాలు అమలుచేస్తూనే ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ ప్రజలకు సమయం కేటాయిద్దామంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా రోజుకు 18 గంటల పాటు పనిచేసినా ఫలితం ఉండడం లేదని చెప్పారు. ఈసమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయు డు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.