
ఖాళీల జాబితా ఇవ్వండి
హైవేల అభివృద్ధికి చర్యలు
● కారుణ్య నియామకాలతో భర్తీ చేస్తాం ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, కార్యాలయ సబార్డినేట్ పోస్టుల ఖాళీల వివరాలను వారంలోగా అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. ఈ ఖాళీల ఆధారంగా కారుణ్య నియామకాలు చేపడుతామని తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణిలో భాగంగా ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ కారుణ్య నియామకాలతో వేచి ఉన్న వారికి న్యాయం జరగడమే కాక ఖాళీలు భర్తీ అవుతాయని తెలిపారు. ఇక ప్రజావాణిలో అందే దరఖాస్తులను పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. కాగా, యూడైస్ పోర్టల్ ప్రకారం విద్యుత్, తాగునీరు, టాయిలెట్లు లేని పాఠశాలలపై నివేదిక ఇస్తే వసతులు కల్పిస్తామని తెలిపారు. జిల్లా అధికారులు సంక్షేమ వసతి గృహాలను ప్రతీ వారం తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని...
● ఏన్కూరు మండలం జన్నారం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 200లో సుమారు 2వేల ఎకరాల భూమిగుట్టలతో ఉన్నందున అన్యాక్రాంతం కా కుండా ప్రజావసరాల కోసం వినియోగించాలని యండ్రాతి శ్రీనివాసరావు తదితరులు కోరారు.
● కూసుమంచి మండలం నరసింహులగూడెంకు చెందిన రత్నకుమారి, పుష్ప, భద్రమ్మ తమకు సర్వే నంబర్ 1,123లో భూమి పంపిణీ చేస్తే, ఇతరులు బాటను కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు.
● చింతకాని మండలం లచ్చగూడెం రైతులు పెసల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.
● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేష్ వినతిపత్రం అందజేశారు.
● ఖమ్మంలోని అంబేద్కర్ గురుకుల కళాశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కోరారు.
● మెనూ ప్రకారం భోజనం వడ్డించకుండా నిర్లక్ష్యం చేస్తున్న బోనకల్ బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతిర్మయిపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ ఆధ్వర్యాన వినతిపత్రం అందజేశారు.
ప్రాధాన్యతాక్రమంలో భూసేకరణ
జాతీయ రహదారులకు అవసరమైన భూమిని ప్రాధాన్యత ప్రకారం సేకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ కె.రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో కలిసి సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. ఎన్‌హెచ్, రాష్ట్ర అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ హైవేల అవసరాలకు భూసేకరణలో వేగం పెంచాలని తెలిపారు. జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఎన్‌హెచ్ 163జీ హైవేకు అసవరమైన భూమి సేకరణ ఈనెలాఖరులతోగా పూర్తిచేస్తామని చెప్పారు. అలాగే, మల్లెమడుగు, రేగులచలక గ్రామాలకు సంబంధించి పరిహారం చెల్లింపుపై దృష్టి సారిస్తామని తెలిపారు. వీసీలో డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, నేషనల్ హైవే ఈఈ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంఅర్బన్: జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి, అనుసంధాన రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. హైదరాబాద్ నుంచి సీఎం వీసీ ద్వారా కలెక్టర్లతో సమీక్షించి పలు అంశాలపై తుమ్మల లేఖ సమర్పించారు. ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేకు రెండు వైపులా సర్వీస్ రోడ్లు, ఖమ్మం రింగ్ రోడ్డు పూర్తికి ఖమ్మం – కురవి రోడ్డు నుండి కలెక్టరేట్ వరకు ఏడు కి.మీ. అనుసంధాన రహదారి నిర్మాణం, జగ్గయ్యపేట – కొత్తగూడెం వయా బోనకల్, వైరా, తల్లాడ జాతీయ రహదారికి ప్రతిపాదించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, మరికొన్ని రహదారుల మంత్రి లేఖ అందించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సీఎంను కోరారు.