
కలుపు మందుల్లోనూ కల్తీ ?
● వరి పైర్లపై పనిచేయక పెరుగుతున్న తుంగ గడ్డి ● వేలాది ఎకరాల్లో పైర్లపై ప్రభావం ● దిగుబడి తగ్గుతుందని అన్నదాతల ఆందోళన
తల్లాడ: అటు మద్దతు ధర, ఇటు ప్రభుత్వ బోనస్ వస్తుందనే ఆశతో ఆరుగాలం కష్టపడి వరి సాగు చేస్తున్న రైతులను కలుపు వేధిస్తోంది. దీంతో అన్నదాతలు అప్రమత్తమై ఒకటికి నాలుగు సార్లు గడ్డి మందు పిచికారీ చేసినా తుంగగడ్డి, తదితర కలుపు ఆగకుండానే పెరుగుతుండడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇందుకు కల్తీ కలుపు నివారణ మందే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. తల్లాడ మండలంలోని వేలాది ఎకరాల్లో ఈ సమస్య ఉండగా అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.
వెదజల్లిన పొలాల్లోనే తీవ్రత
తల్లాడ మండలంలో ఈ ఏడాది 10వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో రైతులు వరి సాగు చేశారు. గత జూలైలో సాంబమసూర బీపీటీ 5204 వరి రకం సాగు మొదలుపెట్టగా, 21 రోజుల తర్వాత కలుపు నివారణ మందు స్ప్రే చేసినా గడ్డి తగ్గలేదు. మళ్లీ 35 రోజుల వయస్సులో, ఆపై ఇంకో నెలకు ఇలా విడతల వారీగా ఎకరాలకు రూ.1,500 చొప్పున రూ.6 వేలు వెచ్చించి నాలుగు సార్లు గడ్డి మందు కొట్టినా ఫలితం లేక దిక్కు తోచని స్థితి ఎదుర్కొంటున్నారు. వెదజల్లే పద్ధతిలో సాగు చేసే వరి పొలాల్లో కూలీలతో కలుపు తీయడం సాధ్యం కాదు. మందు మాత్రమే కొట్టే అవకాశముండడంతో ఆ పనిచేసినా తుంగ గడ్డి చావక 50 శాతం దిగుబడి తగ్గుతుందని వాపోతున్నారు. తల్లాడ మండలంలోని అన్నాగుగూడెం, గోపాలపేట, బిల్లుపాడు, కొత్త వెంకటగిరి, నరసింహారావుపేట, రామచంద్రాపురం తదితర గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండగా.. రైతులు ఆదివారం పొలాల్లో గడ్డి చూపిస్తూ నిరసన తెలిపారు. నకిలీ మందులే తమ సమస్యకు కారణమైనందున బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కలుపు మందుల్లోనూ కల్తీ ?