
ఆలోచింపజేసిన ‘ఆచమనం’
ఖమ్మంగాంధీచౌక్: నెలనెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం 98వ నాటక ప్రదర్శన జరిగింది. కాకినాడ ఎస్వీ రంగారావు కళా స్రవంతి కళాబృందం ఆధ్వర్యాన పి.వెంకన్నబాబు రచించి, డి.వినయ్ దర్శకత్వం వహించిన ‘ఆచమనం’ నాటికను ప్రదర్శించారు. సమాజంలో ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న అంశాలు, ఆత్మహత్యకు యత్నించే వారికి కనువిప్పు కలిగించేలా ఉన్న ఈ నాటిక ఆలోచింపజేసింది. ఆతర్వాత రాయల్ డ్యాన్స్ అకాడమీ కళాకారుల నృత్య ప్రదర్శనతో పాటు కూచిపూడి నృత్యాలు ప్రదర్శించారు. నెలనెలా వెన్నెల నిర్వాహకులు కె.దేవేంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ పార్టీల నాయకులు పోతినేని సుదర్శన్, కూరపాటి వెంకటేశ్వర్లు, కాటంనేని రమేష్, వీరభద్రరావు, నెలనెలా వెన్నెల కార్యదర్శి ఏ.ఎస్.కుమార్ ప్రజానాట్యమండలి అధ్యక్షులు నామ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.