
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
తిరుమలాయపాలెం : వినియోగదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి అన్నారు. మండలంలోని కాకరవాయి సబ్‌స్టేషన్‌లో జూపెడ ఫీడర్‌ను శనివారం సపరేట్ చేసి బ్రేకర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. గతంలో ఒక ప్రాంతంలో విద్యుత్ సమస్య వస్తే అన్ని ఫీడర్లు బంద్ చేయాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఫీడర్ల వారీగా బ్రేకర్ల ఏర్పాటుతో సమస్య ఉన్నచోటే సరఫరా నిలిపేస్తున్నామని తెలిపారు.
విద్యుత్ కనెక్షన్ లేని ఇల్లు ఉండొద్దు
నేలకొండపల్లి : జిల్లాలో విద్యుత్ కనెక్షన్ లేని ఇల్లు ఉండకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీనివాసాచారి అన్నారు. మండలంలోని తిరుమలాపురం అంగన్‌వాడీ కేంద్రానికి జూగా పథకం కింద ఏర్పాటు చేసిన విద్యుత్ కనెక్షన్‌ను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో విద్యుత్ కనెక్షన్ లేని ఎస్సీ, ఎస్టీలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. జన జీవనానికి దూరంగా ఉన్న వారిని గుర్తించి విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 149 కనెక్షన్లు అవసరమని గుర్తించామని, వాటలో ఖమ్మం డివిజన్‌లో 16, ఖమ్మం రూరల్ డివిజన్‌లో 12, సత్తుపల్లి డివిజన్‌లో 7 గ్రామాలు ఉన్నాయని వివరించారు.
విద్యుత్ లైన్ల పరిశీలన..
ముదిగొండ : మండలంలోని ముదిగొండ, వెంకటాపురం గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్లను ఎస్‌ఈ శ్రీనివాసాచారి శనివారం పరిశీలించారు. కొన్నేళ్లుగా విద్యుత్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసిన నిధులతో సమస్య పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు భట్టి విక్రమార్క ప్రభుత్వం నుంచి రూ.9కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. ఖమ్మం, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించామని వివరించారు. నిధులు మంజూరు కాగానే అక్కడ కూడా పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు శ్రీనివాసాచారిని సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో ఖమ్మం రూరల్ డీఈ నాగేశ్వరరావు, భద్రు, బాబూరావు, ఏడీలు చక్రవర్తి, కోక్యానాయక్, ముదిగొండ ఏడీఏ రామకృష్ట, ప్రొటెక్షన్ ఏఈలు కె.రామారావు, రమేష్, మునీర్‌పాషా, మేకపోతుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాసాచారి