
అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణా నియంత్రణకు ప్రణాళికాయుతంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తదితర అధికారులతో డీఎస్‌ఆర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఇసుక వనరులు, ఇతర గనుల వివరాల సర్వే రిపోర్టులు తయారు చేయాలన్నారు. ఇసుక, మట్టి అక్రమ రవాణాను పటిష్టంగా నియంత్రించాలని, పత్రికలలో వార్తలు వస్తున్నా స్పందించకపోవడం సరికాదని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కూడా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోందని, జారీ చేసిన అనుమతులు మేరకే ఇసుక రవాణా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ విషయంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో సీపీఓ ఎ. శ్రీనివాస్, మైనింగ్ ఏడీ ఆర్.సాయినాథ్, టీజీఎండీసీ పీఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాతీయ రహదారుల భూసేకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టర్ అనుదీప్ హాజరై మాట్లాడుతూ.. ఎన్‌హెచ్ 163జీ పరిధిలో ఖమ్మం జిల్లాలో కోర్టు స్టే ముగిసినందున 12 కిలోమీటర్ల మేర రోడ్డు వేసేందుకు 42 హెక్టార్ల భూసేకరణ వేగవంతంగా పూర్తి చేసి, అక్టోబర్ చివరి నాటికి ఎన్‌హెచ్‌ఏకు బదలాయిస్తామని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఎన్‌హెచ్ పీడీలు రామాంజనేయ రెడ్డి, దివ్య, ఈఈ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి