
రేపటి నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం శ్రీవారికి చందన అలంకారం, సర్వాంగ అభిషేకం, తీర్థపు బిందె తోడ్కోని రావడం, శ్రీస్వామి, అమ్మవార్ల యాగశాల ప్రవేశం ఉంటాయని, కలశస్థాపన, గణపతి హోమంతో ప్రారంభమయ్యే ఉత్సవాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు జ్యోతి ప్రజ్వలన చేస్తారని ఈఓ జగన్మోహన్‌రావు తెలిపారు. 23న గణపతి హోమం, అమ్మవారికి శ్రీబాలాత్రిపుర సుందరీ అలంకరణ, 24న శ్రీగాయత్రిదేవి అలంకరణలో ప్రత్యేక పూజలు ఉంటాయని పేర్కొన్నారు. 25న శ్రీఅన్నపూర్ణాదేవిగా, 26న శ్రీమహాలక్ష్మీదేవిగా, 27న శ్రీలలితా పరమేశ్వరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని, 28న శ్రీచండీ అలంకారం, 29న శ్రీసరస్వతీ దేవి అలంకరణ, 30న శ్రీదుర్గాదేవి అలంకారం, అక్టోబర్ 1న శ్రీమహిషాసుర మర్థనిగా అమ్మవారిని అలంకరిస్తామని వివరించారు. 2వ తేదీన చండీహోమం, మహాపూర్ణాహుతి, శమీ పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు శ్రీవారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను దర్శించుకోవాలని ఈఓ కోరారు.