
యూరియా.. ఏదయా?
తెల్లవారుజామున వచ్చాం..
సరఫరాలో ఇబ్బందులు లేవు..
జిల్లా అధికారుల ఆరా
● కూపన్ల విధానంతోనూ పరిష్కారం కాని సమస్య ● ఒకే బస్తా చొప్పున ఇస్తుండడంతో రైతుల అవస్థ ● ఈనెల సరిపడా స్టాక్ రాక పంపిణీలో ఇక్కట్లు
కొణిజర్ల: కొణిజర్ల సొసైటీ కార్యాలయానికి శుక్రవారం 960 బస్తాల యూరియా వచ్చింది. దీంతో రైతులు ఆడామగా తేడా లేకుండా బారులు దీరారు. అయితే 960 మందికే కూపన్లు ఇవ్వడం, మరో 200మందికి పైగా మిగలడంతో వ్యవసాయ, సొసైటీ అధికారులను నిలదీశారు. అందరికీ కూపన్లు ఇవ్వాల్సిందేనని పంచాయతీ కార్యాలయం ఎదుటే బైటాయించారు. శనివారం మరో లోడ్ వస్తుందని చెప్పిన ఏఓ డి.బాలాజీ, ఎస్‌ఐ సూరజ్ అందరికీ కూపన్లు ఇస్తామనడంతో ఆందోళన విరమించారు.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఒక బస్తా యూరియా కోసం రైతులు చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తోంది. సొసైటీకి యూరియా వచ్చిందని తెలియగానే గంట ల తరబడి బారులు తీరడం, ఆపై కూపన్.. ఆతర్వా త బస్తా దక్కించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. రెండు రోజులుగా చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్‌పాయింట్‌కు యూరియా చేరుతుండగా, సొసైటీల వారీగా కూపన్ల పంపిణీ ప్రారంభించారు. ఇందుకోసం జిల్లాలోని కారేపల్లి సొసైటీ, కొణిజర్లలో కార్యాలయాలకు రైతులు వేలాదిగా తరలివచ్చారు. వందల సంఖ్యలో బస్తాల యూరియా కోసం వేలాది మంది పోటీ పడడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసినా ఫలితం కానరాలేదు.
అంచనా – సరఫరాలో వ్యత్యాసం
ఈ వానాకాలం జిల్లాలో అన్ని పంటలు 6,50,015 ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో వరి 2,95,012 ఎకరాల్లో, పత్తి 2,25,613 ఎకరాల్లో ఉండగా, మొక్కజొన్న, వేరుశనగలు, పెసలు తదితర పంటలు ఉన్నాయి. ప్రధానంగా వరి, పత్తి పంటలు ఏపుగా పెరిగేందుకు యూరియా ఉపయోగపడుతుంది. తొలుత కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 54,825 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేసింది. ఆ తర్వాత 27,865 మెట్రిక్ టన్నులే పంపాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 25,884 మెట్రిక్ టన్నులు మాత్రమే జిల్లాకు చేరడంతో సరఫరాలో ఇక్కట్లు ఎదురవుతున్నాయి.
దెబ్బతిన్న పంటలు
వరి, పత్తి కీలక సమయంలో జిల్లాకు అరకొరగానే యూరియా సరఫరా అయింది. దీంతో రైతులు పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. అయినా కొందరికి యూరియా లభించక మిగతా వారి పొలాలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో వరి ఎదుగుదల లేక, దుబ్బు లేక పాడైంది. పత్తి పంట పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది.
కేంద్రాల వద్ద ఉద్రిక్తత
అవసరమైనంత మేర యూరియా జిల్లాకు రాకపోవడంతో అధికారులు రైతులకు తొలుత కూపన్లు జారీ చేస్తున్నారు. ఆపై యూరియా రాగానే పంపిణీ చేస్తుండగా ఉద్రిక్తత నెలకొంటోంది. అందరికీ కూపన్లు ఇచ్చినా వారికి సరిపడా యూరియా రాకపోవడంతో దక్కని వారు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం కారేపల్లి, కొణిజర్ల కేంద్రాల వద్ద కూపన్ల కోసం తొక్కిసలాట జరగగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. కారేపల్లిలో వేలాది మంది రావడంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమాన ఏఓ అశోక్‌కుమార్ సొమ్మసిల్లారు. ఆపై పీఏసీఎస్ నుంచి జిన్నింగ్ మిల్లుకు మార్చడంతో రైతులు పరుగులు తీయగా అక్కడా తోపులాట జరిగింది.
యాసంగికి కూడా ఇప్పుడే..
ఈ వానాకాలం సీజన్‌కే యూరియా అందక రైతులు నానా తిప్పలు పడుతున్నారు. అయితే తక్కువ భూమికి కలిగిన కొందరు రైతులు యాసంగి కోసం కూడా ఇప్పుడే యూరియా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్నట్లు సమాచారం.
ఎన్నిసార్లు తిరిగినా యూరియా దొరకలేదు. ఈరోజు కూపన్ కోసం తెల్లవారుజామున వచ్చాం. రెండెకరాల్లో పత్తి, ఎకరంలో వరి పంట వేశాం. ఒక్క బస్తా యూరియా అయినా వేయకపోతే పంటలు దెబ్బతింటాయి. తొక్కిసలాట జరగకుండా అందరికీ యూరియా సరఫరా చేయాలి.
–అజ్మీరా చిన్ని, భజ్యా తండా, కారేపల్లి
జిల్లాకు గురువారం, శుక్రవారం యూరియా వచ్చింది. పీఏసీఎస్‌ల్లో రైతులకు కూపన్లను జారీ చేసి యూరియా అందిస్తున్నాం. ప్రస్తుతం సరిపడా ఉండగా, ఈ నెలాఖరుతో డిమాండ్ తగ్గుతుంది. కొందరు రైతులు యాసంగి సాగు కోసం కూడా తీసుకుంటున్నారు.
– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి
కారేపల్లి: కారేపల్లి పీఏసీఎస్‌కు వేలాదిగా రైతులు రావడంతో యూరియా కూపన్ల జారీలో ఉద్రిక్తత చోటు చేసుకోగా శుక్రవారం సాయంత్రం జిల్లా సహకార అఽధికారి గంగాధర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య, వైరా ఏడీఏ కరుణశ్రీ చేరుకుని వివరాలు ఆరా తీశారు. ఇప్పటి వరకు 2,152 కూపన్లు పంపిణీ చేశామని, మరో 1,600 కూపన్లు ఇవ్వాల్సి ఉందని ఉద్యోగులు చెప్పారు. రద్దీ నివారణకు మండలంలోని ఐదు రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలని అధికారులు సూచించారు. సొసైటీ చైర్మన్ దుక్కినేని శ్రీనివాసరావు, డైరెక్టర్లు అడ్డగోడ ఐలయ్య, డేగల ఉపేందర్, సీఈఓ బొల్లు హన్మంతరావు పాల్గొన్నారు.

యూరియా.. ఏదయా?

యూరియా.. ఏదయా?

యూరియా.. ఏదయా?