
అంతా మా ఇష్టం..
వసూళ్లపై పట్టింపులేనితనం
● విధుల్లో నిర్లక్ష్యం, అక్రమార్కులపై చర్యలకు తాత్సారం ● కొన్ని మండలాల్లో ఉద్యోగుల వసూళ్లు ● డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహంతో పలువురి బదిలీ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించడమే కాక ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై పట్టింపు లేకపోవడం, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారికి అండగా పలు మండలాల అధికారులు నిలుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారి వ్యవహార శైలిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యాన చింతకాని తహసీల్దార్ కరుణాకర్‌రెడ్డి, ఎస్సై నాగుల్‌మీరా, పెనుబల్లి తహసీల్దార్ నారాయణమూర్తిపై బదిలీ వేటు పడింది. ఇందిరమ్మ ఇళ్ల కూపన్ల ఆధారంగా ఇసుక తరలిస్తున్న వారి నుంచి కొందరు అక్రమంగా వసూలు చేస్తున్నా పట్టించుకోకపోవడం చింతకాని అధికారులపై వేటుకు కారణమైంది. ఇక అవినీతి ఆరోపణలు, వ్యవహారశైలి బాగాలేకపోవడంతో పెనుబల్లి తహసీల్దార్‌పై చర్యలు తీసుకున్నారు.
డిప్యూటీ సీఎం ఆగ్రహం
అక్రమ వసూళ్ల విషయం తెలియడంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఖమ్మంలో ఈనెల 17న కలెక్టర్, సీపీలతో పాటు చింతకాని తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్సైతో సమావేశమయ్యారు. అక్రమార్కులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మండల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు భట్టి ఆదేశాలతో తహసీల్దార్ కరుణాకర్‌రెడ్డి, ఎస్సై నాగుల్‌మీరాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతేకాక మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు ఈ అంశంపై విచారణ చేపట్టారు.
పాస్ పుస్తకాలు ఎలా?
ముదిగొండ మండలంలోని గంగాపురం రెవెన్యూ గ్రామాన్ని దశాబ్దాల క్రితమే మున్నేటి వరద ముంచెత్తుతుండడంతో ప్రజలు ఖాళీ చేశారు. ప్రస్తుతం అక్కడ 122 సర్వేనంబర్ నుంచి 126 సర్వేనంబర్ వరకు 14మంది పట్టాదారు పాసుపుస్తకాలు చేయించుకున్నారు. గంగాపురం రెవెన్యూ పేరుతో పొందిన పాసుపుస్తకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మున్నేరు నడిమధ్యలో నిబంధనలను ఉల్లంఘించి అధికారులు వారికి పాసుపుస్తకాలను జారీ చేశారని చెబుతున్నారు.
నిర్లక్ష్యం.. వేధింపులు
పెనుబల్లి తహసీల్దార్ నారాయణమూర్తి వ్యవహారశైలిపైనా ఆరోపణలు వచ్చాయి. ఆయనపై గతంలోనూ రైతులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. అప్పుడే నారాయణమూర్తి అనారోగ్యానికి గురి కాగా ఇద్దరు ఆర్‌ఐలపై చర్యలు తీసుకున్నారు. సదరు తహసీల్దార్ అవినీతికి పాల్పడడమే కాక సిబ్బందిని, పనుల నిమిత్తం వచ్చేవారిని దుర్భాషలాడతారనే ఆరోపణలున్నాయి. ఇటీవల కొందరు రైతులు మరోమారు ఎమ్మెల్యే మట్టా రాగమయి దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె మంత్రి పొంగులేటికి వివరించారు. దీంతో తహసీల్దార్‌ను కలెక్టరేట్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
చింతకాని మండలం చిన్నమండవ ఇసుక రీచ్ నుంచి ఇందిరమ్మ లబ్ధిదారులు కూపన్ల ఆధారంగా ఇసుక తరలింపునకు అనుమతించారు. అయితే ముదిగొండ మండలం మున్నేటి సమీపాన పట్టా భూములు ఉన్నాయంటూ కొందరు డబ్బు వసూలు చేస్తున్నారు. ఇందుకోసం మున్నేటిలో రహదారి ఏర్పాటుచేయడమే కాక లోపలకు వెళ్లకుండా గేటు బిగించారు. ఒక్కో ట్రాక్టర్ నుంచి ఇక్కడ రూ.వేయి వరకు వసూలు చేస్తున్నా మండల రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై లబ్ధిదారులు, ట్రాక్టర్ల యజమానులు, పార్టీల నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

అంతా మా ఇష్టం..

అంతా మా ఇష్టం..