
దసరాకు ఆర్టీసీ రైట్ రైట్!
రీజియన్ నుంచి 17 రోజుల్లో 1,025 సర్వీసులు నడిపేలా ప్రణాళిక గ్రామీణ ప్రాంతాల బస్సులపై సందిగ్ధత
ఆర్టీసీ బస్సులను వినియోగించుకోండి
ఖమ్మంమయూరిసెంటర్: దసరా పండుగకు సొంత గ్రామాలకు వెళ్లే వారితో పాటు సెలవుల వేళ రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఖమ్మం రీజియన్ అధికారులు కసరత్తు పూర్తిచేశారు. బతుకమ్మ, దసరా పండుగకు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు సొంత గ్రామాలకు వస్తారు. ఈ రద్దీకి అనుగుణంగా ఏయే ప్రాంతాలకు ఎన్ని బస్సులు నడపాలో ప్రణాళిక రూపొందించారు. అయితే, ఈసారి ప్రత్యేకం పేరిట నడిపే అదనపు సర్వీసుల్లో 50శాతం అదనపు చార్జీ వసూలు చేయనున్నారు. అదనపు సర్వీసులన్నీ హైదరాబాద్ రూట్‌లోనే ఏర్పాటు చేస్తుండడంతో డిపోల నుంచి మారుమూల గ్రామాలకు నడిచే బస్సుల సంఖ్య తగ్గనున్నట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్, ఇతర పట్టణాల నుంచి జిల్లా, నియోజకవర్గ కేంద్రాల వచ్చేవారు స్వగ్రామాలకు వెళ్లడంలో ఇక్కట్లు ఎదుర్కొనే అవకాశముంది.
పూల పండుగ ప్రత్యేకం
తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగకు ప్రత్యేకత ఉంది. పండుగల సందర్భంగా విద్యాసంస్థలకు ఈనెల 21 నుండి సెలవులు ప్రకటించగా 20వ తేదీ నుండే ప్రయాణికులు స్వగ్రామాలకు బయలుదేరనున్నారు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టాక బస్సుల్లో నిత్యం రద్దీ ఉంటుండడం.. ఇప్పుడు సెలవులతో మరింత పెరగనుండడంతో అధికారులు అదనపు సర్వీసులు నడిపేందుకు సిద్ధమయ్యారు. రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తే, రోజువారీ మార్గాల్లో బస్సుల కొరత ఏర్పడే అవకాశముంది. దీంతో శ్రీశైలం, హన్మకొండ తదితర ప్రాంతాల సర్వీసులను రద్దు చేసి అదనపు సర్వీసుల కింద వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నుండి రీజియన్‌కు రద్దీ ఉంటుందనే అంచనాతో అధికారులు ఈ మార్గంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
1,025 ప్రత్యేక సర్వీసులు
దసరా పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లో 1,025 ప్రత్యేక సర్వీసులు నడిపిస్తారు. ఈనెల 20వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి ఖమ్మం రీజియన్‌కు, అక్టోబర్ 2నుండి అక్టోబర్ 6 వరకు ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు బస్సులు ఉంటాయి. రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు బస్సుల సంఖ్య పెంచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే, 24గంటల పాటు నాన్‌స్టాప్ సర్వీసులు తిప్పుతారు. ఇవికాక ఖమ్మం నుంచి మణుగూరు, భద్రాచలం, సత్తుపల్లి, కొత్తగూడెం, మధిర, ఇల్లెందు ప్రాంతాలకు కూడా బస్సులు అందుబాటులో ఉంచుతారు.
నేటి నుంచి ప్రత్యేక బస్సులు...
దసరా సెలవుల్లో ప్రయాణికులు సౌకర్యవంతగా, సురక్షితంగా రాకపోకలు సాగించేలా ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తే గమ్యస్థానాలకు సాఫీగా చేరుకోవచ్చు. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతాం. అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉన్నందున ప్రయాణికులు వినియోగించుకోవాలి.
– ఏ.సరిరాం, ఖమ్మం రీజియన్ మేనేజర్

దసరాకు ఆర్టీసీ రైట్ రైట్!