
విద్యార్థులు వంద శాతం హాజరుకావాలి
నేలకొండపల్లి/కూసుమంచి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు వంద శాతం హాజరయ్యేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని జిల్లా పరిషత్ సీఈఓ దీక్షారైనా ఆదేశించారు. నేలకొండపల్లి మండలంలోని నేలకొండపల్లి, రాజేశ్వరపురం, కూసుమంచి మండలంలోని జీళ్లచెరువు పాఠశాలను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. నేలకొండపల్లి పాఠశాలలో 530 మంది విద్యార్ధులకు 404 మంది, రాజేశ్వరపురంలో 586 మందికి 462 మందే హాజరుకావడంతో ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఆతర్వాత తరగతి గదుల్లో విద్యార్థులను సామర్థ్యాలను పరీక్షించారు. అలాగే, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆమె, అంగన్‌వాడీ కేంద్రం, భవిత కేంద్రాల్లో కూడా తనిఖీ చేశారు. ఎంపీడీఓలు ఎం. ఎర్రయ్య, రామచంద్రరావు, ఎంఈఓలు బి.చలపతిరావు, బీ.వీ.రామాచారి తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల తనిఖీలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా