
ఘనంగా ఇంజనీర్స్ డే
ఖమ్మంఅర్బన్: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని సోమవారం ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంపులో ఇంజనీర్స్ డే వేడుకలు నిర్వహించారు. పలువురు ఇంజనీర్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. జల వనరుల శాఖ ఖమ్మం, కొత్తగూడెం ఎస్‌ఈలు మంగళపూడి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకూబ్‌తో పాటు అధికారులు వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కాగా, త్వరలో ఇంజనీర్ల అసోసియేషన్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు వెల్లడించారు.
23న నుంచి
‘దివ్య దక్షిణ’ రైలుయాత్ర
మధిర: దసరా సెలవుల సందర్భంగా దక్షిణాదిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను చుట్టివచ్చేలా ఐఆర్‌టీసీ ఆధ్వర్యాన దివ్యదక్షిణ యాత్ర పేరుతో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ఏర్పాటుచేశారు. ఈ రైలు 23న సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుందని ఐఆర్‌టీసీ అసిస్టెంట్ మేనేజర్ టీవీ.వెంకటేష్ తెలిపారు. మధిరలో సోమవారం ఆయన మాట్లాడుతూ 23వ తేదీన సికింద్రాబాద్‌లో మొదలయ్యే రైలు అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు తదితర పుణ్యక్షేత్రాలను కలుపుతూ ముందుకు సాగుతుందని చెప్పారు. రైలుకు ఖమ్మం, మధిర రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ ఉన్నందున ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక్కొక్కరికి స్లీపర్ రూ.14వేలు, థర్డ్ ఏసీ రూ.22,500, సెకండ్ ఏసీ టికెట్ రూ.29,500గా నిర్ణయించినట్లు తెలిపారు. టికెట్లు, వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో లేదా 96705 99512, 92810 30749, 92819 30714, 92814 95848 నంబర్లలో సంప్రదించాలని వెంకటేష్ సూచించారు.
‘విద్యానిధి’ దరఖాస్తు గడువు గడువు
ఖమ్మంమయూరిసెంటర్: మహాత్మా జ్యోతి బాపూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సంబంధించి ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 24వ తేదీ వరకు పొడిగించారు. ఈమేరకు అర్హులైన అభ్యర్థులు ఈ–పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి.లక్ష్మణ్ సూచించారు.
ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఏర్పాట్లు
ఖమ్మం సహకారనగర్: ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యాన పదో తరగతి, ఇంటర్‌మీడియట్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్‌లోని సోమవారం అధికారులతో సమావేశమైన ఆమె మాట్లాడుతూ ఈనెల 22 నుంచి 28వరకు పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 287 మంది, ఇంటర్ పరీక్షలకు 254 మంది హాజరుకానున్నందున కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్ల చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో ఏ.పద్మశ్రీ, డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి, డీఐఈఓ కె.రవిబాబు, ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారి మంగపతిరావు తదితరులు తెలిపారు.
బౌద్ధక్షేత్రం అభివృద్ధికి కార్యాచరణ
నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎల్.రమేష్ తెలిపారు. బౌద్ధక్షేత్రం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యాన సోమవారం ఆయన చరిత్రకారులతో సమావేశమయ్యారు. క్షేత్రం పరిసరాల్లో చేపట్టిన తవ్వకాలు, చేయాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనందున అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకంగా ఆదరణ పెరుగుతుందని తెలి పారు. చరిత్రకారులు అరవింద్, కె.శ్రీనివాస్, చారిత్రక బృందం సభ్యులు పసుమర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఇంజనీర్స్ డే