
ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో అందే దరఖాస్తులు, వినతిపత్రాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటిప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి దరఖాస్తులు స్వీకరించాక అధికారులతో సమావేశమయ్యారు. ప్రతీ దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. కాగా, ఈఈ హౌసింగ్, డీఆర్‌డీఓ, డీపీఓ, డీఎంహెచ్‌ఓ తదితరులపై పత్రికల్లో వచ్చిన వ్యతిరేక వార్తలపై తీసుకున్న చర్యలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని సూచించారు. డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని...
● వైరా మండలం గన్నవరం క్రాస్‌లోని రెబ్బవరం బస్టాండ్‌ను పునరుద్ధరించాలని స్థానికులు విన్నవించారు.
● వేంసూరు మండలం కందుకూరు రైతులు వరుణ్ అగ్రిటెక్ కంపెనీకి చెందిన బీపీటీ 2782 వరి సాగుతో నష్టపోయినందున కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు.
● బోనకల్ మండలం ఆళ్లపాడుకు చెందిన మరీదు శ్రీను దివ్యాంగుల పింఛన్‌ను పునరుద్ధరించాలని వినతిపత్రం అందజేశారు.
● చింతకాని మండలంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధి గ్రామాలను మధిర డివిజన్‌లోకి మార్చకుండా ఖమ్మం డివిజన్‌లోనే కొనసాగించాలని టీడీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.
నిస్వార్థంగా సేవలు అందించాలి
గ్రామ పాలన అధికారులుగా నియమితులైన వారు క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. జీపీఓలకు నియామక ఉత్తర్వులు అందజేసిన ఆయన మాట్లాడుతూ జిల్లాలో 299 క్లస్టర్లకు గాను 252 మందికి పోస్టింగ్ ఇచ్చామని తెలిపారు. భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన భూ భారతి చట్టం అమలుపై దృష్టి సారించాలని చెప్పారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు టి.సునీల్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి
ఖమ్మం సహకారనగర్: ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల అధికారులతో సమీక్షించారు. 2002 తర్వాత ఓటర్ జాబితా సవరణ జరగనుండగా, మాస్టర్ ట్రెయినర్ల ద్వారా బూత్ స్థాయి ఉద్యోగులకు అవగాహన కల్పించాలని తెలిపారు. వీసీ అనంతరం కలెక్టర్ అనుదీప్ అధికారులతో సమావేశమై సూచనలు చేశారు. 2002 ఎస్‌ఐఆర్ తర్వాత ఓటు హక్కు వచ్చిన అందరి వివరాలు ధ్రువీకరించాల్సి ఉంటుందని చెప్పారు. ఖమ్మం ఆర్‌డీఓ నరసింహారావు, ఎన్నికల విభాగం ఉద్యోగులు ఎం.ఏ.రాజు, అన్సారీ, తదితరులు పాల్గొన్నారు.