ఆంధ్రా ఇసుకకు బ్రేకులు! | - | Sakshi
Sakshi News home page

ఆంధ్రా ఇసుకకు బ్రేకులు!

Sep 16 2025 7:45 AM | Updated on Sep 16 2025 7:45 AM

ఆంధ్రా ఇసుకకు బ్రేకులు!

ఆంధ్రా ఇసుకకు బ్రేకులు!

● చింతలపూడి వద్ద 21 లారీలు సీజ్‌ ● అన్నీ సత్తుపల్లి వ్యాపారులవే... ● ఇన్నాళ్లూ లక్షల టన్నుల ఇసుక అక్రమ రవాణా

● చింతలపూడి వద్ద 21 లారీలు సీజ్‌ ● అన్నీ సత్తుపల్లి వ్యాపారులవే... ● ఇన్నాళ్లూ లక్షల టన్నుల ఇసుక అక్రమ రవాణా

సత్తుపల్లి: ఏపీ నుంచి తెలంగాణలోకి గోదావరి ఇసుక రవాణాకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లే కనిపిస్తోంది. అయితే, జిల్లా పోలీసులు, మైనింగ్‌, రెవెన్యూ అధికారుల తనిఖీలతో ఇది సాధ్యం కాలేదు. ఆంధ్రా – తెలంగాణ ఇసుక మాఫియా మధ్య ఆధిపత్య పోరుతో గుట్టు బయటపడింది. ఏలూరు జిల్లా యర్రగుంటపాడుకు చెందిన ఓ వ్యాపారి లారీలను తెలంగాణలో మరో వ్యాపారి పోలీసులకు పట్టించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇదే సమయాన ఆంధ్రా వ్యాపారి ఇచ్చిన సమాచారంతో డొంక కదలగా మరికొందరి లారీలను ఏలూరు జిల్లా అధికారులు సీజ్‌ చేశారు.

లక్షల టన్నులు...

గోదావరి ఇసుకను ఆంధ్రా సరిహద్దుగా గ్రామాల్లోని వ్యక్తుల పేరిట కొన్నాళ్ల నుంచి తెలంగాణకు తరలిస్తున్నారు. చింతలపూడి మండలంలోని పలు గ్రామాల వ్యక్తుల పేరిట అనుమతి తీసుకుని లక్షల టన్నుల ఇసుకను సరైన పత్రాలు లేకుండానే తరలించారు. అయితే, ఏపీ అధికారులు తనిఖీ చేయగా సీతానగరం గ్రామస్తుల పేరిట 60 లారీల ఇసుక తరలించినట్లు బయటపడినట్లు తెలిసింది. కాగా, నాలుగురోజుల క్రితం చింతలపూడిలో సత్తుపల్లికి చెందిన 21లారీలను సీజ్‌ చేశారు. కొవ్వూరు, తాళ్లపూడి, అన్నదేవరపేట, వాడపల్లి, గోపాలపురం రీచ్‌ల నుంచి సత్తుపల్లి పరిసరాలకు గోదావరి ఇసుక ప్రతిరోజు పదుల సంఖ్యలో లారీల ద్వారా చేరుతోంది. ఈ అంశంపై ఖమ్మం జిల్లా అధికారులు కూడా దృష్టి సారించినట్లు తెలిసింది.

రూ.లక్షల్లో దండుకొని..

సత్తుపల్లికి చెందిన యజమానుల ఇసుక లారీలను విడిపిస్తానని గంగారానికి చెందిన ఓ వ్యక్తి రూ.లక్షలు వసూలు చేసి పత్తా లేకుండా పోయినట్లు సమాచారం. దీంతో ఏపీలోని అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే యత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. అయితే భారీగా ఇసుక అక్రమ రవాణా కావడంతో అక్కడి అధికారులు చేతులెత్తేసినట్లు సమాచారం. ఏదిఏమైనా నాలుగు రోజుల నుంచి సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో ఏపీ గోదావరి ఇసుక అక్రమ రవాణా లేకపోవడంతో స్థానిక ఇసుకకు డిమాండ్‌ పెరిగింది. ఇదే సమయాన అక్రమార్కులు కృష్ణా నది నుంచి ఇసుక రవాణా చేసేందుకు మార్గాలు వెతుకుతున్నట్లు తెలిసింది. తిరువూరు మీదుగా కల్లూరు, వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లికి కృష్ణా నది ఇసుకను తెప్పిస్తున్నా గోదావరి ఇసుక మాదిరి నాణ్యత లేకపోవడంతో నిర్మాణదారులు ఆసక్తి చూపడం లేదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement