
హై సెక్యూరిటీ తప్పనిసరి!
● పాత వాహనాలకు కొత్త నంబర్ ప్లేట్లు ● ఈనెల 30వ తేదీ వరకు గడువు ● అవగాహన కల్పించడంలో అధికారుల వెనుకంజ
ఖమ్మంక్రైం: పాత వాహనాలకు హైసెక్యూరిటీ (రిజిస్ట్రేషన్)నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ రవాణాశాఖ కొద్ది నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు(హెచ్‌ఎస్‌ఆర్‌పీ) అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈనెల 30 గడువుగా ప్రకటించినప్పటికీ రవాణాశాఖ ఆధ్వర్యాన వాహనదారులకు అవగాహన కల్పించడంలో చొరవ చూపకపోవడం గమనార్హం.
2019 మార్చి 31కి ముందు..
అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల(హెచ్‌ఎస్‌ఆర్‌పీ) విధానాన్ని 2014 ఏప్రిల్ 18లో అమల్లోకి తీసుకొచ్చారు. ఆపై రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు నంబర్ ప్లేట్లు బిగించే బాధ్యత ఏజెన్సీలకు అప్పగించారు. కానీ 2019నుంచి అక్టోబర్ 19 నుంచి వాహనం కొనుగోలు చేశాక ఏజెన్సీ బాధ్యులు లేదా డీలర్ల వద్ద నంబర్ ప్లేట్లు బిగిస్తున్నారు. అయితే, 2019 మార్చి 31 వరకు(15ఏళ్లు నిండినవి) జిల్లాలో 1,40,589 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఇందులో ఖమ్మంలో రవాణా శాఖ యూనిట్ పరిధిలో 1,31,975, సత్తుపల్లిలో 4,783, వైరా రవాణా శాఖ కార్యాలయ పరిధిలో 3,831 వాహనాలు ఉన్నాయి. వీటిలో 1,24,496 ద్విచక్రవాహనాలు, 6,655 మోటారు కార్లు, 3,492 వ్యవసాయ వాహనాలతో ఇతరత్రా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ ప్రయోజనాలు
వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్లేట్ చివరన ఉండే లేజర్ కోడ్ ద్వారా వాహనదారుడి పేరు, ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాక వాహనం ధ్వంసమై నంబర్ ప్లేట్ మాత్రమే మిగిలినా పూర్తి వివరాల గుర్తింపునకు అవకాశముంటుంది.
స్పష్టత ఏదీ?
పదిహేనేళ్లు దాటిన వాహనాలన్నింటికీ ఈనెల 30వ తేదీలోగాహైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ అమర్చుకోవాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలుస్తోంది. గడువులోగా బిగించుకోకపోతే జరిమానా తప్పదని చెబుతున్నారు. కానీ గడువు సమీపిస్తున్నా రవాణా శాఖ అధికారులు వాహనదారులకు అవగాహన కల్పించడంలో పెద్దగా చొరవ తీసుకోకపోవడం గమనార్హం. ఇదేమిటని ఆరా తీస్తే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సరైన ఉత్తర్వులు అందలేదని సెలవిస్తున్నారు. దీంతో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించుకోవాలా, తప్పనిసరేం కాదా అన్న విషయమై వాహనదారులకు స్పష్టత రావడం లేదు.