
మామ వేధింపులు తాళలేక బలవన్మరణం
ఖమ్మంక్రైం: భర్తకు సొంత బాబాయి, తనకు మామ వరుసైన వ్యక్తి లైంగిక వేధింపులు భరించలేక జిల్లా కేంద్రంలో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం శ్రీనివాస్‌నగర్ కాల్వ కట్ట ప్రాంతానికి చెందిన యోషిత(24) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన బెజ్జం నవీన్‌ను ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకోగా, ఆమెను నవీన్ బాబాయి, సింగరేణిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రామకృష్ణ లైంగికంగా వేధిస్తున్నాడు. దీనిపై భర్తకు చెప్పినా పట్టించుకోకపోగా ఆయన కుటుంబీకులు యోషితకు పిల్లలు పుట్టడం లేదని వేధిస్తున్నారు. ఇంతలోనే రామకృష్ణ తన వద్ద యోషిత ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని బెదిరించడంతో మనస్థాపానికి గురైన ఆమె బుధవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
పెనుబల్లి: మండలంంలోని పాత కారాయగూడెం తండాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గుగులోతు శిరీష(23) హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఆమె హైదరాబాద్‌లో మూడు నెలలుగా ఉద్యోగం చేస్తోంది. హైదరాబాద్ అమీర్‌పేటలో ఉంటున్న ఆమె బుధవారం హాస్టల్ గదిలో ఉరి వేసుకుంది. లంకసాగర్‌కు చెందిన బొడ్డు కిరణ్‌తో ప్రేమ వ్యవహారమే ఈఘటనకు కారణమని శిరీష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మాదాపూర్ పోలీసులు పోస్టుమార్టం అనంతరం గురువారం మృతదేహాన్ని అప్పగించగా, వీఎం బంజర్ పోలీస్‌స్టేషన్ ఎదుట అంబులెన్స్ నిలిపి ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఎస్సై వెంకటేష్ విచారణ చేపడుతామని వారికి నచ్చచెప్పారు.
జీవాలు దొంగిలిస్తున్న నలుగురి అరెస్ట్
కారేపల్లి: గొర్రెపోతులు, మేకపోతులు, కోళ్లు చోరీ చేస్తున్న నలుగురిని కారేపల్లి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మండలంలోని ఉసిరికాయపల్లి ఓసీ సమీ పాన ఎస్‌ఐ బి.గోపి ఆధ్వర్యాన వాహనాలు తనిఖీ చేస్తుండగా ఉసిరికాయపల్లికి చెందిన శివయ్య, సురేష్, గోపి, ప్రకాశ్ ఒకఆటో, రెండు ద్విచక్రవాహనాల్లో వస్తూ అనుమానాస్పదంగా కనిపించారు. వీరి ఆటోలో ఒక గొర్రెపోతు ఉండడంతో విచారిస్తే పలు గ్రామాల్లో మేకపోతులు, గొర్రెపోతులు, కోళ్లు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు తేలింది. ఈమేరకు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్‌ఐ గోపి తెలిపారు.
గణేష్ నిమజ్జనంలో అపశృతి
ట్రాక్టర్ పైనుంచి పడి యువకుడు మృతి
వేంసూర్: గణేష్ నిమజ్జనం ఊరేగింపులో ప్రమాదం చోటు చేసుకోగా ఓ యువకుడు మృతి చెందాడు. వేంసూరు మండలం వెంకటాపురంలో బుధవారం గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరుగుతుండగా షేక్ రషీద్(21) ట్రాక్టర్ నడుపుతున్నాడు. ఆయన అలిసిపోవడంతో మరో వ్యక్తికి ట్రాక్టర్ నడపమని ఇచ్చి పక్కన కూర్చున్నాడు. ఇంతలోనే డ్రైవర్ ఒక్కసారిగా ముందుకు పోనివ్వడంతో ఇంజన్‌పై కూర్చున్న రషీద్ అదుపు తప్పి కింద పడగా, ఆయన పైనుంచి టైరు వెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. రషీద్ తండ్రి నాగుల్‌మీరా ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మామ వేధింపులు తాళలేక బలవన్మరణం