
‘ఫైర్’ కష్టాలకు త్వరలో చెక్ !
● అగ్నిమాపక కేంద్రానికి త్వరలో అధునాతన భవనం ● రూ.3 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
ఖమ్మంక్రైం : జిల్లా అగ్నిమాపక శాఖ సిబ్బంది కష్టాలు ఇక తీరనున్నాయి. ఖమ్మంలో అనేక సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్న ఫైర్ స్టేషన్‌కు త్వరలో అధునాతన భవనం నిర్మాణం కానుంది. ఎప్పుడు కూలుతుందో తెలియక.. పాములు, తేళ్లతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఉద్యోగులు ఇక ప్రశాంతంగా విధులు నిర్వర్తించే అవకాశం కలగనుంది.
1998లో ఎన్నెస్పీ క్యాంప్‌లోకి..
ప్రస్తుత షాదీఖానా స్థలంలో అంతకుముందు అగ్ని మాపక కేంద్రం ఉండేది. 1998లో ప్రభుత్వం ఆ స్థలాన్ని షాదీఖానాకు కేటాయించగా.. ఎన్నెస్పీ క్యాంప్‌లోని ఓ భవనంలోకి అగ్నిమాపక కేంద్రాన్ని మార్చారు. డీఎఫ్‌ఓ, ఏడీఎఫ్‌ఓతో పాటు ఖమ్మం నగర అగ్నిమాపక అధికారి కార్యాలయాలు కూడా ఇక్కడే నిర్వహించేవారు. అయితే క్రమంగా ఆ భవనం శిథిలావస్థకు చేరడంతో ఖమ్మం నగర కార్యాలయాన్ని మాత్రమే అందులో ఉంచి మిగతా వాటిని అద్దె గదుల్లో నడిపిస్తున్నారు. ఆ భవనం ఇటీవల మరింతగా కుంగిపోగా.. పక్కనున్న ఖాళీ స్థలంలో రేకులతో రెండు గదులు వేశారు. అవి అగ్నిమాప క అధికారి, సిబ్బందికే సరిపోతుండడంతో వాహనాలు మాత్రం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్నాయి.
ఎట్టకేలకు నిధులు..
అగ్నిమాపక శాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరగా.. నూతన భవనం నిర్మించాలని దాదాపు 20 ఏళ్లుగా అధికారులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. గతంలో రెండుసార్లు భవన నిర్మాణానికి నిధులు మంజూరైనా తిరిగి వెనక్కు వెళ్లాయి. ఆ తర్వాత కూడా పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఎట్టకేలకు ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. పోలీస్ గృహ నిర్మాణ సంస్థ ఈ భవనాన్ని నిర్మించనుండగా ఆర్‌అండ్‌బీ, అటవీ అధికారులు ఇప్పటికే స్థలాన్ని పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అన్ని కేంద్రాలూ ఈ భవనంలోనే..
ఎన్నెస్పీ క్యాంప్‌లో ప్రస్తుతం 1,152 గజాల స్థలం అగ్నిమాపక కేంద్రం ఆధీనంలో ఉంది. ఇందులోనే జిల్లా ఫైర్ అధికారి, సహాయ అధికారి, నగర ఫైర్ ఆఫీసర్ కార్యాలయాలు నిర్మించనున్నారు. భవనం కింది భాగంలో అగ్నిమాపక వాహనాలు పార్కింగ్ చేస్తారు. అయితే తాత్కాలికంగా కార్యాలయాల నిర్వహణ, వాహనాల పార్కింగ్ కోసం సిబ్బంది ప్రత్యామ్నాయ స్థలాన్ని అన్వేషిస్తున్నారు. అది లభ్యం కాగానే.. ప్రస్తుత నిర్మాణాలను తొలగించి నూతన కట్టడాలను ప్రారంభిస్తారు. ఈ మేరకు తాత్కాలిక స్థలం కేటాయించాలని అధికారులు కలెక్టర్‌ను కోరారు.