
త్వరలోనే డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ
● అసంపూర్తి నిర్మాణాలు ‘ఇందిరమ్మ’ నమూనాలో పూర్తి ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో సిద్ధంగా ఉన్న 1,132 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులకు అందించేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి మంగళవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ప్రారంభించనివి, పురోగతిలో ఉన్నవి మినహా నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో వసతులు కల్పించి పంపిణీ చేయాలని తెలిపారు. ఈ ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక వివిధ దశల్లో ఉన్న 383 ఇళ్లను సైతం లబ్ధిదారులకు కేటాయించి ఇందిరమ్మ ఇళ్ల నమూనాలో నిర్మించుకునేలా ప్రభుత్వ సాయం అందించాలని కలెక్టర్ సూచించారు. ఇంకా ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మరింత మెరుగైన వైద్యం అందించాలి
తిరుమలాయపాలెం: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో వచ్చే వారికి అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. తిరుమలాయపాలెంలోని కమ్యునిటీ హెల్త్ సెంటర్‌ను మంగళవారం తనిఖీ చేసిన ఆయన వివిధ విభాగాలు, రిజిస్టర్లను పరిశీలించడమే కాక వైద్యసేవలపై గర్భిణులతో ఆరా తీశారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమైన కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల వ్యాప్తి నేపథ్యాన పరిశుభత్ర ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, అవసరమైన మందులు, వ్యాధి నిర్ధారణ కిట్లు అందుబాటులో పెట్టుకోవాలని తెలిపారు. వైద్యాధికారులు కృపాఉషశ్రీ, బొల్లికొండ శ్రీనివాసరావు, ప్రతాప్‌రెడ్డి, అమర్‌సింగ్, డీఏఓ పుల్లయ్య, తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ సిలార్ సాహెబ్ పాల్గొన్నారు.

త్వరలోనే డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ